KCR – N. Shankar : ‘వడ్డించేవాడు మనోడు అయితే ఏ మూలన కూర్చున్నా ముక్కపడుతుందట..’ ఇఫ్పుడు తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్ కు సైతం పెద్దసార్ కేసీఆర్ గుర్తింపు, గౌరవం, దానికి తగ్గట్టుగా ఫలితం దక్కింది. కోర్టుకెళ్లి పోరాడి సాధించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సామాజిక వర్గాల వారీగా, వివిధ రంగాల వారీగా హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కేటాయిస్తున్నారు. గిరిజన, దళిత, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఇప్పటికే భూమి కేటాయించి భవన నిర్మాణాలు ప్రారంభించారు. సినిమారంగం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్‌కు కూడా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కోసం 5 ఎకరాలు కేటాయించారు. ఈమేరకు శంకర్ సొమ్ము చెల్లించి నిబంధనల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే ఈ భూ కేటాయింపును తప్పుపడుతూ గతంలో పిటిషన్ దాఖలైంది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
-సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నినాదం..
తెలుగులో ఎన్‌కౌంటర్ సినిమాతో దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ఎన్.శంకర్. తెలంగాణ ఉద్యమ సమయంలో చిత్ర పరిశ్రమ నుంచి తన వాయిస్ వినిపించిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం ఈయనకు తక్కువ ధరకే భూమిని కేటాయించింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. రూ. 2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ.25 లక్షలకు ఎలా కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమంది విషయంలో ఇలాగే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని గుర్తు చేసిన హైకోర్టు ధర్మాసనం.. అంతగా కావాలంటే ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా అని అప్పట్లో వ్యాఖ్యానించింది.
-పిటిషన్ కొట్టివేత..
ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో స్టూడియో నిర్మాణం కోసం దర్శకుడు శంకర్‌కు ఐదెకరాల భూమిని రూ. 25 లక్షలకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపును ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ భూ కేటాయింపుపై చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని హైకోర్టు ఛీప్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ తుకారామ్ జీ తీర్పు చెప్పారు. కేటాయింపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు.
-ప్రోత్సాహంగానే..
దేశంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రభుత్వం భూమి కేటాయించడంపై ఎలాంటి తప్పులేదని పేర్కొంది. సినిమాతోపాటు సంగీతం, క్రీడా రంగంతోపాటు పద్మ అవార్డు గ్రహీతలకు వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్రం సముచిత గౌరవం కల్పిస్తూ ఉంటాయి. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ వాదనతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం ఎన్.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ పరిశ్రమ అభివృద్దికై భూమి కేటాయించడాన్ని సమర్ధించింది.
ఇప్పటికే వివిధ కులాలు, సంఘాలకు కేసీఆర్ విలువైన హైదరాబాద్ భూములను చీప్ గా కేటాయించారు. కానీ ఎన్.శంకర్ మాత్రమే ఆ భూములను చదును చేయించి నిబంధనలకు అనుగుణంగా కోర్టులో సరిగ్గా పోరాడారు. దక్కించుకున్నారు. మిగతా సంఘాలు, కులాలు ఇలా చేయడంలో విఫలమయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన చాలా స్థలాలు పెండింగ్ లో పడిపోయాయి. ఒక్క ఎన్. శంకర్ మాత్రమే ఇందులోంచి బయటపడ్డారు.