Vande Bharath Express : వందేభారత్.. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన రైలు ఇది. అత్యాధునిక సౌకర్యాలు, సెమీ స్పీడ్, ప్రయాణికులకు కంఫర్టబుల్ సీటింగ్, ఏసీ, వైఫై ఇలా హైటెక్ రైలు ఇది. తొలి రైలును 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. తర్వాత కరోనా కారణంగా తయారీ నిలిచిపోవడంతో ప్రారంభం ఆలస్యమైంది. తాజాగా వేగంగా తయారవుతుండడంతో పలు రాష్ట్రాల్లో పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రైళ్లను ప్రారంభిస్తున్నారు.
-ఇంతవరకు రెండు రంగుల్లో…
అయితే ఈ వందేభారత్ రైళ్లను ఇప్పటి వరకు కేవలం రెండు రంగుల్లోనే కనిపిస్తున్నాయి. సిల్వర్ కలర్, మధ్యలో నెవీ బ్లూ లైన్ రంగులు మాత్రమే కనిపిస్తున్నాయి. ట్రాన్స్‌పరెంట్ అద్దాలు ఉండడంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఈ రైలు రంగులు మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వే శాఖ నిర్వహిస్తున్న ఈ రైళ్లు చెన్నైలో తయారవుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వీటిని తయారు చేస్తున్నారు.

-ప్రధాని మానస పుత్రిక..
ఇక ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రికగా భావిస్తున్న ఈ రైళ్ల రంగును మార్చేశారు. ఇప్పటి వరకు ఉన్న రైళ్లతోపాటు తాజాగా కొత్తగా కాషాయ బార్డర్‌తో రైళ్లను రూపొందించారు. సిల్వర్, కాషాయం కాంబినేషన్‌తో మరింత మెరుగైన సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే శాఖ ప్రకటించింది.
-రాబోయేవన్నీ కాషాయ రంగులోనే..
ఇకపై రాబోయే రైళ్లన్నీ కాషాయ బార్డర్‌తోనే వస్తాయని తెలుస్తోంది. మరో మూడు నాలుగు ఏళ్లు ఈ రైళ్లే పట్టాలపై పరుగులు పెడతాయని తెలుస్తోంది. పాత బ్లూ కలర్ రంగుతోపాటు కొత్తగా కాషాయ రంగులో వందేభారత్ రైళ్లు ప్రయాణికులను ఆకట్టుకుంటాయని రైల్వే శాఖ అంటోంది.
-ఎన్నికల నేపథ్యంలోనే..
మరో ఏడెనిమిది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం రైళ్ల రంగు మార్చిందని ఆరోపణలు వస్తున్నాయి.. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి రంగుల ప్రయోగం చేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు రంగు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రంగులు, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ రంగు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీలం రంగు.. ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు రంగులు వేయించాయి. తాజాగా 108 అంబులెన్స్‌లకు కూడా జగన్ సర్కాన్ నీలం రంగు వేయించింది. తాజాగా బీజేపీ కూడా ఆ దోవలోకి వెళ్లిపోయింది. ప్రాంతీయ పార్టీలలాగా రాజకీయాల కోసం రంగులు మార్చడంలో తామేమీ తీసిపోమని నిరూపించింది. తామే తయారు చేయించామని.. తమ రంగులే వేసుకుంటోంది. ఎన్నికల వేళ ఈ ప్రయోగం వందేభారత్ రైళ్లపై చేసినట్లు తెలుస్తోంది.