Homeజాతీయ వార్తలుLockup Death : చిన్న తప్పుకు మరణశిక్ష: ఇదేనా కేసీఆర్ సార్ తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్?

Lockup Death : చిన్న తప్పుకు మరణశిక్ష: ఇదేనా కేసీఆర్ సార్ తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్?

Lockup Death : “తెలంగాణ సాధిస్తోంది. దేశం అనుసరిస్తోంది.. మేము దేశానికే తల మానికం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే గర్వకారణం. మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నాం” ఇలా ఉంటాయి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు. కానీ ఇవాల్టికి ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు లేఖలు ఇవ్వందే ఓ ఎస్ఐ నుంచి ఐజీ ల దాకా పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక డిజిపి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇలాంటి స్థితిలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికి రోల్ మెడల్ ఎలా అవుతుందో కెసిఆరే చెప్పాలి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్న రాష్ట్ర హోం శాఖ.. జరుగుతున్న లాకప్ డెత్ ల గురించి నోరు మెదపదు.. అసలు హోంశాఖకు ఒక మంత్రి ఉన్నాడనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పైగా పోలీసులు అంటే అధికార పార్టీ నాయకులకు రక్షణ కల్పించే సెక్యూరిటీగా మారిపోయారు. ప్రతిపక్షాల మీద దురుసుగా ప్రవర్తించే పోలీసులు.. అధికార పక్షం నాయకుల చేసిన నేరాలను మసిపూసి మారేడు కాయ చేయడంలో దిట్ట అయిపోయారు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పైకి చెబుతున్నప్పటికీ… విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడంలో తెలంగాణ పోలీసులు ఆరి తేరారు.

మెదక్ పోలీసుల చేతిలో ఖాదర్ అనే వ్యక్తి ఇటీవల లాకప్ డెత్ కు గురయ్యాడు. వాస్తవానికి ఖాదర్(35) మెదక్ జిల్లా వాసి. ఉన్న ఊరిలో పని లేకపోవడంతో హైదరాబాద్ కు వలస వెళ్లి పోయాడు. అక్కడ పాత బస్తీలో తోచిన పని చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో ఖాదర్ ను జనవరి 29న మెదక్ ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుళ్ళు పవన్, ప్రశాంత్ వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో అతడిని చిత్రహింసలకు గురి చేశారు. వాస్తవానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు. కానీ మెదక్ పోలీసులు ఆ పని చేశారు.. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించకుండా ఓ ఇంట్లో నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఖాదర్ ముందుగా మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. గత శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. వాస్తవానికి ఇలాంటి విషాదం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాదు. గతంలోనూ ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన మరియమ్మను ఓ దొంగతనం కేసులో సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. ఆమె కొడుకును దారుణంగా కొట్టారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ కన్నుమూసింది. ఈ ఘటన నేపథ్యంలో దళిత సంఘాలు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుళ్ళు రషీద్, జానయ్య ను విధుల నుంచి డిస్మిస్ చేసింది..

వాస్తవానికి ప్రతి ఏటా 20 మందిని విచారణ పేరుతో పోలీసులు పెడుతున్న చిత్రహింసలు బలి తీసుకుంటున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే లాకప్, విషయం మరణాలకు సంబంధించి కేసుల్లో పోలీసులపై ఎటువంటి చర్యలు ఉండటం లేదు. కొన్నిసార్లు పోలీసులు తమ చేతుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు భారీ ఎత్తున నగదు ఇచ్చి ఇబ్బంది రాకుండా చేసుకుంటున్నారు. మరి కొన్నిసార్లు అయితే చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ను బెదిరించి అసలు నిజాలు వెలుగులోకి రాకుండా చూసుకుంటున్నారు.

జ్యుడీషియల్, లాకప్ మరణాలకు కళ్లెం వేసేందుకు గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. దాని ప్రకారం ఎవరైనా అదుపులోకి తీసుకొని విచారణ జరపాల్సి ఉంటే, తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉన్న గదిలో ప్రశ్నించాలి. కస్టడీలోకి తీసుకుంటే తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. అయితే అధిక శాతం పోలీస్ అధికారులు ఈ పని చేయడం లేదు. అధికార పార్టీ అండ ఉండడంతో రెచ్చిపోతున్నారు. టిఆర్ఎస్ ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లో ఇవాల్టికి ప్రతిపక్ష నాయకులకు పోలీస్ స్టేషన్లలోకి వచ్చేందుకు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారులను అధికార పార్టీ నాయకులు వెనకేసుకొస్తుండటంతో ఏమి చేయలేని పరిస్థితి. జ్యూడిషల్ లాకప్ డెత్ జరిగితే సంబంధిత పోలీస్ అధికారులపై జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారణ జరపాలి.. కానీ చాలా సంఘటనలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ జరిపి అసలు నిజాలు వెలుగులోకి రాకుండా చూస్తున్నారు. చింతకాని మండలానికి చెందిన మరియమ్మ విషయంలోనూ పోలీసులు ఇలానే చేశారు. అయితే దళిత సంఘాలు ఆందోళనకు దియడంతో వెనక్కి తగ్గారు.

ఇక ఈ ఘటనపై డిజిపి అంజనీ కుమార్ వేగంగా స్పందించారు.. త్వరలో ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. కానీ ఇదే చొరవ దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో ఉంటే ఇంకా బాగుండేది. హైదరాబాద్ నట్ట నడిరోడ్డులో ఒక వ్యక్తిని చంపితే స్పందించని పోలీసులు.. మెదక్ జిల్లాలో జరిగిన లాకప్ డెత్ పై వేగంగా స్పందించడం గమనార్హం. పైగా ఒక వరంగల్ తో దీనిపై విచారణకు ఆదేశించారు.. అధికార పార్టీ నాయకుల సిఫారసు లేకుండా పోస్టింగ్ ఇవ్వాలని దుస్థితిలో ఉన్న పోలీస్ శాఖను పట్టించుకోని డిజిపి… ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేలా కాచుకోవడంలో మాత్రం చొరవ చూపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇక ఖాదర్ లాకప్ డెత్ విషయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.. జోడో యాత్రలో ఉన్న ఆయన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఖాదర్ లాకప్ డెత్ జరిగిందని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్న ప్రభుత్వం.. అమాయకులైన ప్రజలను హింసిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో తాము ఆందోళనకు దిగుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

అయితే రాజకీయ ఒత్తిడి.. పై అధికారుల ఒత్తిడి వల్లనే పోలీసులు ఇలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని.. నేరాల కట్టడి పేరిట జరిపే విచారణ కొందరి ప్రాణం  మీదకు వస్తుందని పోలీసులు వాపోతున్నారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి తీవ్ర ఘటనకు పాల్పడకుండా ఉంటేనే మేలు అని పలువురు సూచిస్తున్నారు.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version