Funeral Business: అంత్యక్రియలకు ఓ రేటు.. ఇదో కార్పొరేట్ ‘మానవీయత

కొన్నేళ్ల కిందట వరకు.. మనిషి చనిపోతే ఆప్తులు క్షణాల వ్యవధిలో చేరిపోయేవారు. సమాచార వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు సైతం సకాలంలో చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొనేవారు.

Written By: Dharma, Updated On : November 7, 2023 1:26 pm

Funeral Business

Follow us on

Funeral Business: నా చిన్నతనంలో.. అని ఎవరైనా మొదలు పెడితే ఎన్నెన్నో బంధాలు, అనుబంధాలు బయటపడతాయి. మనిషి మనిషికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను తెలియజేస్తాయి. మనిషిని మనిషి నేరుగా కలవడం ఉండేది. శుభకార్యాలు, మంచి చెడులకు మాత్రమే కాదు.. తమ తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విరామం దొరికితే ప్రతి సందర్భంలోనూ బంధుమిత్రులను కలవడం అనేది ఒక వ్యాపకంగా ఉండేది. ఆ కలయికకు స్వార్థం తెలియదు.నిర్దిష్ట లక్ష్యాలు ఏమి ఉండేవి కావు.అయితే ఇప్పుడు అంటే ముమ్మాటికీ సమాధానం దొరకదు. అసలు అటువంటి పరిస్థితి లేదు. చివరకు అయిన వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని స్థితికి మనిషి మారాడు. ఈ పరిస్థితిని గమనించిన వ్యాపార వర్గాలు అంతిమ సంస్కారాలను సైతం వ్యాపారంగా మార్చుతుండడం విశేషం.

కొన్నేళ్ల కిందట వరకు.. మనిషి చనిపోతే ఆప్తులు క్షణాల వ్యవధిలో చేరిపోయేవారు. సమాచార వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు సైతం సకాలంలో చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొనేవారు. సుదూరంలో ఉన్నవారు సైతం ఎంతో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని మరి తమ ఆత్మీయులను చివరి చూపు చూసుకునేవారు. ఇప్పుడు సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రవాణా వ్యవస్థ మెరుగుపడింది. కానీ మానవ సంబంధాలు దెబ్బ తినడంతో అయినవారు సకాలంలో చేరలేకపోతున్నారు. రకరకాల కారణాలు చెప్పి ఆత్మీయుల చివరి చూపునకు దూరమవుతున్నారు. ఇటువంటి తరుణంలో అంత్యక్రియలకు సంబంధించి సరికొత్త ఆలోచన చేసింది ఓ కార్పొరేట్ సంస్థ. కార్పొరేట్ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏకంగా ఓ సంస్థను నెలకొల్పింది. దానికి సభ్యత్వం సైతం స్వీకరిస్తోంది. వింతగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. భారత సనాతన సంప్రదాయానికి ప్రపంచమే సెల్యూట్ కొట్టింది. అటువంటి భారతదేశంలో ఇటువంటి పోకడలు కనిపించడం విచారకరం.

అయితే కార్పొరేట్ అంత్యక్రియలు అంటే.. ఆ స్థాయిలోనే అంతిమ సంస్కారాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. అక్కడ ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంతిమ సంస్కారాలు నిర్వహించే పండితులు, నాయి బ్రాహ్మణులు ఉంటారు. పూలదండలు, అంత్యక్రియ సామాగ్రి వారే సమకూర్చుతారు. చివరికి భుజం పట్టి వెంట నడిచే వ్యక్తులను సైతం వారే సమకూర్చుతారు. అన్ని మతాల వారికి.. వారి సంప్రదాయాలతో దహన క్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు సంబంధించి సభ్యత్వ రుసుముగా రూ. 37,500 గా నిర్ణయించారు. తమ వాళ్లపై సంబంధంలేని, అయినవారు రారని నిర్ధారించుకున్న వృద్ధులు, పండు టాకులు ఈ సంస్థలో సభ్యత్వం తీసుకోవడం విశేషం.

ప్రస్తుతం ఈ సంస్థ రూ.50 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో ఈ వ్యాపారం రెండు వేల కోట్ల రూపాయల మైలురాయికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే భారతదేశంలో సంబంధాలను చక్కగా స్టడీ చేసిన ఈ సంస్థ.. మానవ సంబంధాలతోనే వ్యాపారం ప్రారంభించడం విశేషం. రానున్న కాలంలో కుమారులు, కుమార్తెలు, బంధువులు, ఆత్మీయులు అంత్యక్రియల్లో పాల్గొనరని.. కేవలం ఫోన్ల ద్వారా పలకరింపులు చేస్తారని గమనించిన ఈ సంస్థ వ్యాపారంగా మలుచుకోవడం విశేషం. ఈ సంస్థ ఎంత అభివృద్ధి సాధిస్తుందో.. సమాజంలో మానవ విలువలు అంత పతనమైనట్టు.. ఇది వాస్తవం. సర్వేజనా సుఖినోభవంతు..