CM Jagan Rule: కరోనాతోనే రెండేళ్లు వృథాగా పోయే.. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో గద్దెనెక్కిన జగన్ కు లాక్ డౌన్తో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కరోనా తగ్గి కుదుటపడుతున్న వేళ ప్రతిపక్ష టీడీపీ,జనసేనలు చేస్తున్న రాజకీయాలతో వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా పోతోందట.. అటు ఆర్థిక కష్టాలు,, ఇటు ప్రతిపక్షాలు టైట్ చేస్తున్న వేళ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఫెయిల్ అవుతున్నారా? లేక ఫెయిల్ చేస్తున్నారా? అన్న సందేహాలు చుట్టుముడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లు అవుతోంది. మరో రెండేళ్లు మాత్రమే గడువు ఉంది. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి జరిగిన పరిణమాలను చూసుకుంటే ఎక్కువగా ప్రజా పాలన కంటే ప్రతిపక్షాలను కట్టడి చేయడంతోనే సరిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తమకు దొరికిన కొన్ని సమస్యలతో వైసీపీని ఇరుకునపెట్టేలా రాజకీయం చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే పనిగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఇదే అస్త్రంగా చేసుకున్నారు. జగన్ పాలన గురించి ఎంత ప్రచారం చేసిన ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. జగన్ కేజై కొట్టారు.

ఇసుక రీచ్ ల విషయంలో మాత్రం చంద్రబాబు ఆందోళనకు ప్రజలు మద్దతు పలికారు. దీంతో టీడీపీ వర్గీయులు తమకు దొరికిన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ అధికార పార్టీ నాయకులను ఇరుకున పెడుతున్నారు. ఇక మేజర్ మిస్టేక్స్ పై చంద్రబాబు అండ్ కో కోర్టుల వరకు వెళ్లడంతో వాటికి సమాధానం చెప్పడంతోనే వైసీపీ సమయం వృథా అవుతోందని అంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిని ప్రజలకు చేరనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని అంటున్నారు.
ప్రభుత్వాన్ని నడిపించడంలో జగన్ కు అనుభవం లేకపోవచ్చు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే నేరుగా సీఎం సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో కొన్ని కొన్ని తప్పులను జగన్ చేయొచ్చు. కానీ సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇదే అదనుగా జగన్ మిస్టేక్స్ ను పట్టుకుంటున్నారు. సీఎం సీట్లో కూర్చొన్న వారికి ఇలాంటివి కామనే అయినా వాటిని పరిష్కరించడంలో మాత్రం జగన్ కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నాయకులు ప్రతిపక్షాలను తమ వ్యూహాలతో తొక్కిపడేస్తారు. ఆ విషయాలు పైకి కనిపించవు. కానీ జగన్ వర్గం మాత్రం బహిరంగంగానే టీడీపీపై విమర్శల దాడికి దిగుతోంది. ఈ క్రమంలో దూకుడు కూడా పెంచుతోంది. దీంతో జగన్ వర్గాన్ని టీడీపీ నాయకులు ప్రజల్లో చులకన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజకీయ అనుభవం లేకున్నా జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు భేషుగ్గానే ఉన్నాయని కొందరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులకు అవసరమైన నిత్యావసరాలు అందించేందుకు కృషి చేస్తున్నారని, అదే సమయంలో ప్రతిపక్షాలను తిప్పికొడుతున్నారని అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకుల వ్యాపారాలపై ఇటీవల వైసీపీ సర్కార్ దాడులు పెరిగాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సీఎం ను ఇరకాటంలో పెట్టేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనాతో గడిచిపోయాయి. దీంతో జగన్ మార్క్ ప్రజలపై పడకుండానే కాలం గడిచిపోతోంది. ఉన్న ఈ సమయంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి సమయం పోతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత కారణంగా కొన్ని సంక్షేమ పథకాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రయోజనం లేకుండా పోతుండడంతో అటు వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి గా ఫెయిల్యూర్ అయ్యారని ప్రతిపక్షాలు కొత్త పాటపాడుతున్నాయి. ఇందుకు ఆయనకు రాజకీయ అనుభవం లేకనే పాలనపై పట్టు కోల్పోతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కు ఇంచుమించుగా మరో రెండేళ్లు మాత్రమే గడువు ఉంది. ఈ సమయంలోనే తన పాలన సత్తా నిరూపించి ప్రజలను ఆకట్టుకోవాలి. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఓటు బ్యాంకు అధికంగా ఉన్నా అది జారిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.