CM Jagan: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో నిర్మలా సీతారామన్ నాలుగోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో దీనిపై ప్రతీఒక్కరు ఆసక్తిని కనబర్చారు. దీంతో నిన్నంతా ప్రజలు టీవీలకు అతుక్కుపోవడం కన్పించింది. మోదీ సర్కారు ప్రధానంగా ప్రజలపై పన్నుల భారం మోపకుండా కేంద్రం బిల్లును ప్రవేశపెట్టడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురు పెదవి విరుస్తున్నారు.

కేంద్రం బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎలాగూ వ్యతిరేకిస్తుందనే విషయం అందరికీ తెల్సిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై బడ్జెట్ పై ఓ రేంజులో ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం 5గంటలకు కేంద్ర బడ్జెట్ పైనే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని ఏకిపారేశారు. రెండున్నర గంటల సేపు నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పాయింట్ పాయింట్ గా బీజేపీని టార్గెట్ చేశారు.
కేంద్రంలోని బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిళించి పడేయాలని, మోదీ దేశానికి ప్రధాని కాదని, కేవలం గుజరాత్ కే ప్రధాని అంటూ విమర్శలు గుప్పించారు. ఇంతటి కుర్సబుద్ది ఉన్న ప్రధానిని తాను ఇప్పటి వరకు చూడలేదని, 75ఏళ్లలో రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందలేదని అందుకే కొత్త రాజ్యాంగం తీసుకు రావాల్సిన అవశ్యకత ఉందంటూ కుండబద్ధలు కొట్టారు. ఈ బడ్జెట్ తో కేంద్రం అందరికీ గుండు సున్న పెట్టిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం మోహమాటంగానే బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని, రైతులు, పేదలు కరోనాతో కుదేలయ్యారని వీరిని ఎలా ఆదుకుంటారనేది మాత్రం చెప్పలేదన్నారు. ఆహార సబ్సిడీని తగ్గించి పేదలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి సైతం కేంద్ర బడ్జెట్ పై మొక్కుబడిగా విమర్శలు చేశారు తప్పా ఎక్కడా చిత్తశుద్ది కన్పించలేదు.
ఏపీకి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం ఉండటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ లాగా దుమ్ముదులిపాల్సిన సమయంలో జగన్ సైలంట్ ఉండటంతో ఆయన కేంద్రంలోని బీజేపీ చూసి భయపడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బడ్జెట్ వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాలను కూడా వివరించలేని బలహీన స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్లారా? అన్న చర్చ ఆపార్టీలోనే నడుస్తోంది.
కొంతకాలంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇస్తున్నా ఏపీకి ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలను మాని కేంద్రంలోని బీజేపీని ఎదిరిస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేకుంటే ఏపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకెళుతారో వేచిచూడాల్సిందే..!