CM Jagan vs Ramoji Rao : అన్నదాత మ్యాగజిన్ మూతపడినప్పుడే జగన్మోహన్ రెడ్డి రామోజీరావుకి కౌంట్ డౌన్ షురూ చేశాడు. వాస్తవానికి ఈ మ్యాగజిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం డబ్బులు ఇస్తే ప్రతి నెల అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ కార్యాలయాలకు, ప్రభుత్వం సూచించిన రైతులకు అన్నదాత సంచికలు సరఫరా చేస్తామని మాట ఇచ్చింది. కానీ దాని సంస్థ యజమాని రామోజీరావు కాబట్టి, పైగా అక్కడ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. రామోజీరావుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ దిశగానే జగన్ అడుగులు వేశాడు. రామోజీరావు కుంభస్థలం మార్గదర్శిని కొట్టేశాడు. కాకలు తీరిన వైయస్ రాజశేఖర్ రెడ్డి చేయలేని పనిని తాను చేసి నిరూపించాడు.
ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి..
వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే ఉండవల్లి అరుణ్ కుమార్.. రామోజీరావు మార్గదర్శి కేసులో మాత్రం సహాయం చేశాడు. న్యాయ పరంగా కోవిదుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి కేసులో ఉన్న లొసుగులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశాడు. ఇదే సమయంలో చంద్రబాబు ఆర్థిక స్తంభాలను ఒక్కొక్కటిగా పెకిలించాలని ఉద్దేశంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేశాడు. చంద్రబాబుకు దన్నుగా నిలబడుతున్న రామోజీరావు ఆర్థిక మూలమైనటువంటి మార్గదర్శిని పెకిలించే పని మొదలుపెట్టాడు. సిబి సిఐడిని రంగంలోకి దించాడు. చరిత్రలో తొలిసారిగా రామోజీరావు ఇంటికి వెళ్లి విచారణ చేయించాడు. ఎంతోమందిని పడుకోబెట్టిన రామోజీరావును.. విచారమైన వదనంతో నడుముకు బెల్ట్ కట్టుకొని, మంచంలో పడుకునేలా చేసాడు. ఇక్కడితో జగన్ ఆగలేదు. ఆగితే అతడు జగన్ ఎలా అవుతాడు.
కోర్టుకు వెళ్లినప్పటికీ..
అయితే జగన్ దూకుడు భరించలేక రామోజీరావు కోర్టుకు వెళ్లినప్పటికీ అంతగా ఊరట లభించలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు పలు కీలకమైన దస్త్రాలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తు జరిపారు. అయితే రామోజీరావు చిట్ ఫండ్స్ వ్యాపారం పేరుతో నిధులను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ ప్రక్రియ జరుగుతుండగానే ఏపీసీఐడీ పోలీసులు ఒక అడుగు ముందుకేసి 730 కోట్ల ఆస్తులను అటాచ్ చేసారు. అంతేకాదు ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సంపాదించేందుకు మార్గదర్శిని మరింత తవ్వెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఇంత జరుగుతున్నప్పటికీ అటు రామోజీ సంస్థలు గాని, ఇటు ఆయనను కాపాడేందుకు ముందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక్క మాట మాట్లాడకపోవడం విశేషం.
బిజెపి పెద్దలనుంచి..
మార్గదర్శి ఆస్తుల అటాచ్ విషయంలో కేంద్రంలోని బిజెపి పెద్దలనుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో బిజెపి నేతలు జగన్ మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ.. ఈ ఒక్క విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరడం, వారు కూడా ఓకే చెప్పడంతో రామోజీరావు మీద జగన్ ప్రతీకారం తీర్చేందుకు మార్గం సుగమం అయింది. కి చెందిన బిజెపి కీలక నేత ఒకరు ఇందుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అంతటి రాజశేఖర్ రెడ్డి వల్ల కానిది జగన్ చేతల్లో చేసి చూపించాడు. తన తండ్రి ఆశయాన్ని ఈ విధంగా నెరవేర్చాడు అని వైఎస్ఆర్సిపి నాయకులు అంటున్నారు.