China Provokes India: ఆర్థిక బలం, సైనిక బలం ఉందన్న గర్వంతో చైనా విర్రవీగుతోంది. ఒకవైపు చైనా ఆగడాలకు మోదీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నారు. అయినా.. దుందుడుకు చర్యలు ఆపడం లేదు. గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తుంది. భారత సహనాన్ని పరీక్షిస్తోంది. తాజాగా భారత్‌లోని భూభాగాలను తమవిగా చూపుతూ మ్యాప్ విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా భూభాగాలుగా పేర్కొంది. బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
డ్రాయింగ్ పద్ధతిన మ్యాప్..
‘ఈ మ్యాప్ చైనా జాతీయ సరిహద్దులు.. ప్రపంచంలోని వివిధ దేశాల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా రూపొందించాం’ అని చైనా తెలిపింది. చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ ఈ మ్యాపుల్ని రూపొందించగా.. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ భూభాగాలుగా చూపింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని పేర్కొంది. తాజా ఎడిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను ప్రామాణీకరిస్తూ మ్యాపును రూపొందించడం గమనార్హం.
ఇది మూడోసారి..
అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ ఈవిధంగా డ్రాగన్ మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబరులో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది.
1962లో అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణ..
1962లో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సగానికి పైగా భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఆ తర్వాత డ్రాగన్ కాల్పుల విరమణ ప్రకటించి, తన సైన్యాన్ని మెక్‌మోహన్ రేఖ నుంచి వెనక్కు రప్పించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ ప్రాంతంగా చైనా వాదిస్తోంది. టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా నుంచి భారత ప్రధాని వరకూ అరుణాచల్‌ను సందర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా, డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్పష్టం చేసింది. కొద్ది రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: China provokes india includes arunachal in new standard map
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com