Pawan Kalyan-Chandrababu : అవినీతిపరుడని విమర్శిస్తే లెక్కలతో సహా సమాధానం చెప్పవచ్చు. కోర్టులో కేసు వేసుకోమని సవాల్ విసరొచ్చు. కూనీకోరని విమర్శిస్తే క్రిమినల్ కేసు పెట్టమని కోరవచ్చు. చేతనైతే లోపలెయ్యమనొచ్చు. కానీ అధికార పార్టీ బట్ట కాల్చి మీద వేస్తోంది. నిరూపించలేని ఆరోపణలు చేస్తూ మానసికానందం పొందుతోంది. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడంటూ విమర్శలు చేస్తోంది. ప్యాకేజీ ఎంత తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు ? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. వైసీపీ నోర్మూయాల్సిందే.

పవన్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయతను, ఆదరణను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. తమ కుర్చీ కింద ఏకు మేకై కూర్చుంటాడని భయపడుతోంది. టీడీపీతో కలిసినప్పుడల్లా ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడంటూ ఆరోపణలు చేస్తోంది. జనసేనాని, జనసైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. కావాలనే రెచ్చగొడుతోంది. జనసేనాని వైసీపీ వ్యూహాలను గమనించారు. వారు రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నారు.
ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడంటూ వైసీపీ చేస్తున్న విమర్శల పై కాపు సంక్షేమ సేన స్పందించింది. వైసీపీ విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టాలని డిమాండ్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారు ? ఎంత ప్యాకేజ్ ఇచ్చారు ? ఎప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని దత్తత తీసుకున్నారు ? అనే వైసీపీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని కాపు సంక్షేమ సేన డిమాండ్ చేస్తోంది. వైసీపీ విమర్శలకు మీడియా ముఖంగా చంద్రబాబు సమాధానం చెప్పి, వాటిని ఖండించాలని కాపు సంక్షేమ సేన కోరుతోంది.
చంద్రబాబు వివరణ కాపు సామాజిక వర్గ ఆత్మాభిమానానికి, జనసేనకి, పవన్ కళ్యాణ్ కి చాలా అవసరమని కాపులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతల నోరు మూయించాల్సిన అవసరం ఉందని కాపులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాపు సంక్షేమ సేన డిమాండ్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలి. పవన్ పై వైసీపీ చేస్తున్న విమర్శల్లో నిజమెంతో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇదే ఇప్పుడు కాపులకు, కాపు సంక్షేమ సేనకు ఆత్మగౌరవ నినాదంగా మారింది. దీనికి చంద్రబాబు సమాధానం అవసరం ఎంతైనా ఉందని కాపు సంక్షేమ సేన డిమాండ్ చేస్తోంది.