CM Jagan: సీట్ల సర్దుబాటుకు జగన్ సిద్ధమయ్యారు. కుదిరితే ఎమ్మెల్యే.. కుదరకపోతే ఎమ్మెల్సీ అంటున్నారు. వై నాట్ 175 ప్రశ్నిస్తున్నారు. కుప్పంతో సహా అన్నీ మనవే అని చెబుతున్నారు. ఇక ఎన్నికలే తరువాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు డెడ్ లైన్లు పెడుతున్నారు. గెలుపే పరమావధిగా పని చేయాలని సూచిస్తున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు కోసం జగన్ కుస్తీ పడుతున్నారు. సరిగా పనిచేయని వారిని పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే 28 మంది ఎమ్మెల్యేలకు డెడ్ వైన్ విధించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారితో ఇంటి పోరు మొదలైంది. దీంతో కొందరికి ఎమ్మెల్యేలు, కొందరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు .. ఎమ్మెల్యే పదవి ఇస్తూ.. ఆశావహులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు.
త్వరలో 21 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. మొత్తం స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. నియోజకవర్గాల వారీగా సీనియర్లను, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారు. తద్వార ఎమ్మెల్యే అభ్యర్థులకు లైన్ క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ సూత్రాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు.
మార్పులు, చేర్పుల్లో భాగంగా విజయవాడ తూర్పు లో దేవినేని అవినాశ్ కు టికెట్ ఖరారు కావటంతో, అక్కడ నుంచి బొప్పన భవ కుమార్ కు, మండపేట నుంచి పట్టాభిరామయ్య చౌదరికి, పర్చూరు నుంచి రావి రామనాధంకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మండపేటలో తోట త్రిమూర్తులు, పర్చూరులో ఆమంచి కృష్ణమోహన్ కు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా చాలా కాలంగా మర్రి రాజశేఖర్, మేకా శేషుబాబు, జంకె వెంకటరెడ్డి వంటి నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ రాజు పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో కొందరికి సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో అవకాశం దక్కనుంది. ఇటీవల మరణించన చల్లా భగీరథ రెడ్డి స్థానంలో ఆయన భార్య లక్ష్మీకి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుల్లో ఒకరికి ఎమ్మెల్సీ దక్కనుంది. సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి ఒక సీనియర్ నేతకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆరు నెలల ముందే ప్రకటిస్తానని జగన్ చెప్పారు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులనే మొదటగా ప్రకటించి.. ఎమ్మెల్యే అభ్యర్థులకు దారి సుగమం చేయాలని జగన్ భావిస్తున్నారట.