BJP TDP Alliance: బిజెపికి మూడు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లు.. కన్ఫర్మ్ చేసిన చంద్రబాబు

BJP TDP Alliance 2009లో బిజెపికి శక్తికి మించి ఇచ్చిన సీట్ల విషయాన్ని సీనియర్లు గుర్తు చేశారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించారు.

Written By: Dharma, Updated On : February 7, 2024 5:00 pm

BJP TDP Alliance

Follow us on

BJP TDP Alliance: ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్ దశకు చేరుకుంది. బిజెపితో కలిసి వెళ్లాలనుకున్న టిడిపి, జనసేన వ్యూహానికి ఈరోజు మరో అడుగు పడనుంది. బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. పొత్తుల అంశాన్ని తేల్చనున్నారు. అయితే బిజెపి నుంచి సీట్ల డిమాండ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పార్టీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలను సేకరించారు. పొత్తు ఉభయతారకంగా ఉంటేనే సమ్మతించాలని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ఏకపక్ష డిమాండ్ కు ఒప్పుకోవద్దని చంద్రబాబు వద్ద సీనియర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

2009లో బిజెపికి శక్తికి మించి ఇచ్చిన సీట్ల విషయాన్ని సీనియర్లు గుర్తు చేశారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ బిజెపి కోరిన విధంగా అధిక స్థానాలు కేటాయిస్తే పార్టీలో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. బిజెపికి మూడు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ బిజెపి మాత్రం 25 అసెంబ్లీ స్థానాలు, 6 నుంచి 8 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం. దీనిపైనే తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు.వారి అభిప్రాయాలను సేకరించారు. అమిత్ షా ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలి? పార్టీ నిర్ణయం ఎలా చెప్పాలి అన్నదానిపై చర్చించారు.

బిజెపి పెద్దలు సైతం పొత్తుకు అంగీకరించడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బిజెపి 400 సీట్లు దక్కించుకోవాలని వ్యూహంతో ఉంది. బిజెపికి 370 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. మిగతా స్థానాలను మిత్రపక్షాలతో నెట్టుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో జెడిఎస్, టిడిపి, జనసేనల సహకారంతో సీట్లు సాధించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టిడిపి సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్, టిడిపి నుంచి బిజెపిలో చేరిన సీఎం రమేష్ ఇదే అంశంపై అమిత్ షా తో వరుస మంతనాలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబుతో మాట్లాడి ఇరుపక్షాల ప్రతిపాదనను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు బిజెపి ఎంపీ స్థానాలకు పట్టుపట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానాల విషయంలో పట్టు విడిచినా.. ఎంపీ స్థానాలకు వచ్చేసరికి మాత్రం కనీసం 6 సీట్లు కేటాయించాలని కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి సైతం అదే సంకేతాలు వస్తున్నాయి. అయితే టిడిపి ముఖ్య నాయకులు మాత్రం బిజెపికి మూడు ఎంపీ స్థానాలు, 10 వరకు అసెంబ్లీ స్థానాలు ఇస్తే పర్వాలేదని అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. అంతకుమించి సీట్లు ఇస్తే మాత్రం పొత్తు ద్వారా లాభం కంటే నష్టం అధికమని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఎన్నికల క్యాంపెయినింగ్ సాధ్యమని.. బలమైన వైసీపీని ఢీకొట్టాలంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని చంద్రబాబు పార్టీ నేతలకు వారించినట్లు సమాచారం. అమిత్ షాతో సమావేశం అయినప్పుడు చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. రేపటికి పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రానుంది.