Kadapa Steel Plant : ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కంపెనీలను నష్టాల పేరుతో మోడీసార్ పప్పూ బెల్లాల్లా అమ్మేస్తున్నాడు. ప్రభుత్వం అంటే పాలించాలని.. కానీ ఈ యాపారం చేసుడేందని ఎయిర్ ఇండియా నుంచి మొదలుపెడితే విశాఖ స్టీల్ వరకూ అన్నింటిని తృణమో ఫణమో రేటు కట్టి మరీ అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. పోర్టులను తన జిగ్రీ ఫ్రెండ్ అదానీకి అమ్మేసిన మోడీ.. ఎయిర్ ఇండియాను టాటాలకు రాసిచ్చేశారు. ఈ సొమ్మునంతా కేంద్రప్రభుత్వం అభివృద్ధి పేరిట ఏదేదో కహానీలు చెబుతోంది. అందరి చెవుల్లో పిచ్చిపూలు పెడుతోంది. అభివృద్ధి చేయడం వరకూ ఓకే కానీ.. అభివృద్ధి పేరిట లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మడమే తప్పు. ఎల్ఐసీ లాంటి లాభదాయక సంస్థను కూడా ప్రైవేటుకు అమ్మితే కొని అదానీ, అంబానీలాంటి వారు బాగుపడుతారు తప్పితే ప్రజలకు ఏం ఉపయోగం లేదు. కార్పొరేట్లకు పంచి ప్రజల చిప్ప చేతికి ఇచ్చే ఇలాంటి వ్యవహారాలను ఎవరూ హర్షించరు.

దేశంలో మోడీ సర్కార్ వచ్చాక.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తోంది. నష్టాలను సాకుగా చూపి ఈ పనిచేస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోనూ ముడి ఇనుము గనులున్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గతంలో హామీలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను స్థాపిస్తామన్నది. ఇప్పటికే ఉన్నవి అమ్ముకుంటున్న మోడీ సార్.. కడపలో స్టీల్ ప్లాంట్ ను కూడా ఎత్తేశాడు. ఇదే పాపం అని అధికార వైసీపీ నేతలు , ప్రతిపక్షాలు అడిగితే.. ‘కడపలోని ముడి ఇనుము లాభదాయకం కాదు.. నాసిరకం వర్కవుట్ కాదని ’ ఏదో సిల్లీ కారణం చెప్పి వదిలించుకుంది. ఇప్పటికే ఏపీలోని విశాఖలోని కేంద్ర ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ను ఎత్తేసిన మోడీ సర్కార్ కోట్లు పెట్టి కడపలో కొత్త ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కడుతుందని భావిస్తే అత్యాశే అవుతుంది.
అయితే కేంద్రం పెట్టదు సరే.. ఆ ముడి ఇనుము ఖనిజాలను ఏం చేయాలి? అన్న సంశయం మీకు రావచ్చు. అందుకే తాజాగా మోడీకి జిగ్రీ దోస్తు అయిన అదానీతోపాటు ప్రఖ్యాత దేశీయ స్టీల్ కంపెనీ ‘జేఎస్.డబ్ల్యూ’ఖు రాసిచ్చేశారు. కేంద్రం ఓవైపు కడప ముడి ఇనుము లాభదాయకం కాదు అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరిశ్రమ పెట్టమని కుండబద్దలు కొట్టింది.. మరి ‘అదాని’, జేఎస్.డబ్ల్యూకి ఎలా ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి అనుమతులు ఇచ్చింది.? ఈ నాసిరకం ముడి ఇనుము వాటికి ఎలా క్వాలిటీగా మారుతుందని ప్రశ్నిస్తే.. మీరు దేశద్రోహి అవుతారు.. ఎందుకంటే మోడీ సర్కార్ హయాంలో ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అది ‘నాసిరకం ముడి ఇనుము.. ప్రైవేటుకు మాత్రం బంగారంలాంటి నాణ్యమైన ముడిఇనుము’.. ప్రైవేటుకు దోచిపెట్టేందుకే ఇలా కేంద్రం నాటకాలు వేస్తోందని చెప్పకతప్పదు.
ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ పెట్టమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కడపలో ‘జేఎస్.డబ్ల్యూ’ ప్రైవేటు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదింప చేసింది. ఈ మేరకు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు జేఎస్.డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు ఆమోదం తెలుపడం చూసి అందరూ విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం ఆమోదించడం.. రాష్ట్రంలోని జగన్ సర్కార్ వెంటనే అనుమతులు ఇవ్వడం చూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రకృతి సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేయడం తప్పితే ఇందులో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. తొలిదశలో JSW రూ.3300 కోట్ల పెట్టుబడి పెడుతుందట.. ఇక JSW మాత్రమే కాదండోయ్.. కేంద్రంలోని మోడీకి సన్నిహితులైన అదానీ గ్రీన్ ఎనర్జీ, షిరిడీ సాయి ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు కూడా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. మొత్తం పెట్టుబడుల విలువ రూ.23958 కోట్లు.
ఇలా కేంద్రం ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కు ఇక్కడి గనులు వేస్ట్ అని చెప్పి.. ఇవే గనులతో ప్రైవేటుకు దోచిపెట్టేలా పరిశ్రమలకు అనుమతించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదంతా ప్రైవేటుకు దోచిపెట్టేందుకే ఇలా చేస్తున్నారా? కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.