Telangana Elections 2023: కేసీఆర్‌ను.. ముంచినా.. తేల్చినా బీజేపీదే భారం!

బీజేపీ అగ్రనేతలంతా నాలుగు రోజులుగా తెలంగాణలో మకాం వేశారు. ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం యోగి వరకు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 2:17 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరాయి. రెండు రోజుల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. ఈ రెండు రోజులు ఎవరి పైచేయి సాధిస్తే విజయం వారినే వరిస్తుంది. అయితే, కేసీఆర్‌ను ఇప్పుడు బీజేపీ భయపెడుతోంది. మొన్నటి వరకు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్‌ లాంటి హేమాహేమీలు తెలంగాణలో ప్రచారం చేసినా కేసీఆర్‌ ఆందోళన చెందలేదు. ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుందని, బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కన్నా ఎక్కువ ఉన్నందున గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ బీజేపీ అగ్రనేతల ఎంట్రీ గులాబీ బాస్‌లో గుబులు రేపింది.

అగ్రనేతలంతా ఇక్కడే..
బీజేపీ అగ్రనేతలంతా నాలుగు రోజులుగా తెలంగాణలో మకాం వేశారు. ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం యోగి వరకు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమలనాథులు సక్సెజ్‌ అయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ గర్జన సభ, మాదిగల విశ్వరూసభకు ప్రధాని మోదీ హాజరు కావడం, స్పష్టమైన ప్రకటన చేయడంతో ఈ రెండు వర్గాల ఓట్లు ఈసారి చీలిపోతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్‌కు గెలుపుపై ఉన్న ధీమా క్రమంగా సడలుతూ వస్తోంది.

రైతుల్లో మార్పు..
ఇక కేసీఆర్‌ కీలకమైన ఓటు బ్యాంకులో రైతులు ఒకరు. రైతుబంధు ఇస్తున్నాం కాబట్టి.. ఓట్లన్నీ 2018 తరహాలో బీఆర్‌ఎస్‌కే పడతాయని భావించారు. కానీ, ఈసారి కాంగ్రెస్‌ 15 వేల రైతుబంధు హామీ ఇచ్చింది. బీజేపీ అయితే.. రైతుబంధు కాకుండా ధాన్యం మద్దతు ధర రూ.1000 పెంచుతామని ప్రకటించింది. దీంతో రైతులతోపాటు, కౌలురైతుల ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. క్వింటాల్‌కు రూ.1000 అదనంగా చెల్లిస్తే.. ఎకరాకు రూ.15 వేలకుపైగా అదనపు ఆదాయం వస్తుంది. రైతులు, కౌలు రైతులకు లాభం జరుగుతుంది. రైతుబంధుతో రైతులకన్నా భూస్వాములే ఎక్కువ లాభపడుతున్నారు. దీంతో రైతుల ఓట్లు కూడా చీలిపోతున్నాయి.

నాడు చంద్రబాబుపై కోపంతో..
ఇక 2018 ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను నిలపడం, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ సమాజానికి నచ్చలేదు. బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఈ ప్రయోగం చేశారు. దీంతో బీజేపీ తీవ్రంగా నష్టపోగా, లాభం మాత్రం బీఆర్‌ఎస్‌కు జరిగింది. ఈసారి చంద్రబాబు పోటీలో లేరు. బీజేపీ సంప్రదాయ ఓట్లు బీజేపీకి ఉన్నాయి. బీసీ, ఎస్సీ(మాదిగ) ఓట్లు దాదాపుగా బీజేపీకే పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య చీలిపోతున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ అనుకూల ఓట్లు కూడా బీజేపీ వైపు మళ్లుతున్నాయి. దీంతో గులాబీ బాస్‌ టెన్షన్‌ పడుతున్నారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు, మారిన ఓటర్ల వైఖరి ఎవరికి లాభం చేస్తుందో అంతుచిక్కడం లేదు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చితే బీఆర్‌ఎస్‌కే లాభం. కానీ, వ్యతిరేక ఓట్లతోపాటు అనుకూల ఓట్లు చీలిపోతే.. బీఆర్‌ఎస్‌ కొంప మునగడం ఖాయం. దీంతో ఏది చేసినా.. ఏది జరిగినా అందుకు బీజేపీ కారణం కావడం వాస్తవం.