AP BJP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అన్ని పార్టీలు ముందస్తుకు రెడీ అవుతున్నాయి. అధికార వైసీపీ మొదలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ కూడా సమరానికి సై అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండాను రెపరెపలాడించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి 175 సీట్ల కాన్సెప్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అన్ని సీట్లలో వైసీపీనే గెలుస్తుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ఇటీవల ‘గడపగడప’కు కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు సరికదా.. మంత్రులు, ఎమ్మెల్యేకు నిలదీతలు ఎదురవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్కృతంగా దర్శనమిస్తున్నాయి.
ఇదే సమయంలో అధికార పార్టీకి చెక్ పెట్టేలా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. దసరా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం కొత్త యాత్రకు నేటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది.
కేంద్రంలో అధికారంలో ఉండటాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్న ఏపీ బీజేపీ క్రమంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు, యాత్రలతో క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ ఈరోజు నుంచి యువ సంఘర్షణ యాత్రకు సిద్ధమైంది. ఏపీలోని 175 నియోజకవర్గాలను టచ్ చేసేలా యువ సంఘర్షణ యాత్ర కొనసాగనుండటం విశేషం.
ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు… ఇప్పుడు ఏం చేస్తున్నారనే అంశాలను బీజేపీ నేతలు యువ సంఘర్షణ యాత్రతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఆగష్టు 2 నుంచి 15 వరకు రాష్ట్రంలో బైక్ యాత్ర కొనసాగించనున్నారు. 13 రోజులపాటు దాదాపు 7,500 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను టచ్ చేసేలా బీజేపీ ఈ యాత్రను ప్లాన్ చేయడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పటికే పీపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు యువ మోర్చా ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఆగష్టు 2న తిరుపతి నుంచి ప్రారంభమై రాయలసీమ వ్యాప్తంగా ఒక యాత్ర, కోస్తా, గోదావరి జిల్లా మీదగా ఉత్తరాంధ్ర వరకు మరో యాత్రను ఏకకాలంలో ప్రారంభించనున్నారు. ఆగష్టు 15 వరకు ఈ యాత్ర కొనసాగేలా కార్యాచరణ రూపొందించారు. ఈ యాత్ర పూర్తి చేసిన అనంతరం ఆగష్టులోనే విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ, అమిత్ షాతోపాటు జాతీయ నేతలను ఆహ్వనించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ యాత్ర బీజేపీకి ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!