Kavitha vs ABN RK: జర్నలిస్టుల లాగానే రాజకీయ నాయకులకు హిప్పోక్రసి ఎక్కువ. మాట అంటే పడలేరు. అలాగని ఎదుటివాళ్లను మాట అనకుండా ఉండలేరు. ఢిల్లీలో లిక్కర్ స్కాం లో తల దూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్లో పాల్గొన్నారు కదా! ఆ సందర్భంగా ఇద్దరి మధ్య పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ ఖజానాను పప్పు బెల్లాల్లాగా పంచి అప్పుల కుప్ప చేసే అధికారం మీ నాన్నకు ఎవరిచ్చారు అంటూ రాధాకృష్ణ కవితను ప్రశ్నించారు. దీన్ని ఆ సమయంలో కవిత సరిగా డిఫెండ్ చేయలేకపోయారు. పైగా ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారని ఆర్కే ఆరోపించారు. ఇందులో ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రస్తావన వచ్చింది. అప్పట్లో గెలిచేందుకు టిఆర్ఎస్ దళిత బంధు అని ఒక కొత్త స్కీమును పెట్టింది. మొదట్లో దీని ఎంపిక బాధ్యతను అధికారులకు ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత మనసు మార్చుకొని ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఒక్కో యూనిట్ కు పది లక్షల చొప్పున ఇస్తున్న నేపథ్యంలో ఈ పథకం కూడా గులాబీ రంగు పూసుకుంది. బహుశా ఇదే ఆర్కే ఆగ్రహానికి కారణమై ఉంటుంది.

కవిత ఎందుకు చెప్పలేకపోయారు
లిక్కర్స్ స్కాం లో ఇరుక్కున్న తనకు ఒక రిలీఫ్ కోసం ఆర్కే డిబేట్లో కవిత పాల్గొన్నారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఆర్కే సంధించిన కొన్ని ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉచిత పథకాల మీద తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ విషయాన్ని ఆర్కే లేవనెత్తారు. అయితే అవి ఉచిత పథకాలు కావని, ప్రజల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అని కవిత సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
Also Read: IND Vs PAK: థ్రిల్లింగ్ చివరి ఓవర్.. పాకిస్తాన్ పై టీమిండియా గెలుపునకు అతడే కారణం
కానీ అప్పటికే ఆర్కే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ముఖ్యంగా దళిత బంధు స్కీముకి సంబంధించి ఆర్కే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరికి 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారని కవితని ప్రశ్నించారు. ఇలాంటి ఉచిత పథకాల వల్ల రేపటి తరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఆమెను నిలదీశారు. అయితే ఈ పథకాన్ని గొప్పగా అభివర్ణించిన ఆమె అదే స్థాయిలో ఆర్కే కు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. చర్చ ఇలా సాగుతుండగానే నమస్తే తెలంగాణ పత్రిక స్థాయిని కూడా ఆర్కే తన వ్యాఖ్యలతో దిగజార్చారు. దీంతో అటు కక్క లేక, ఇటు మింగలేక కవిత నవ్వునాశ్రయించారు. ఆ షో ముగిసిన తర్వాత జర్నలిజం సర్కిల్లో కవితకు సానుభూతి పెరగకపోగా.. లిక్కర్ స్కాం లో ఇరుక్కుంది కాబట్టే ఆర్కే షో కి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక కవిత షోకి వెళ్లిన నాటి నుంచి ఆర్కే మీద గులాబీ శ్రేణులు మరింత ఆగ్రహంగా ఉన్నాయి. అయితే అతడికి కౌంటర్ ఎలాగ ఇవ్వాలో తెలియక దళిత బంధుపైన చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకొని అతడి దిష్టిబొమ్మలను రాష్ట్రవ్యాప్తంగా దహనం చేస్తున్నారు. అయితే రాధాకృష్ణకు, కెసిఆర్ కు అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి. అంటే అవి విడిపోయేంత పెద్దవి కావు.. అలాగని కలిసి ఉండేంత చిన్నవి కావు. ఇద్దరి మధ్య నలభై ఏళ్ల స్నేహం ఉంది కాబట్టే ఆర్కే నోటి వెంట ” పుట్టింటి గొప్పతనం మేనమామకు తెలియదా” అనే వ్యాఖ్యలు వస్తుంటాయి. ఇక గతంలోనూ ఆంధ్రజ్యోతికి, నమస్తే తెలంగాణకు వాద ప్రతివాదాలు నడిచాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అంటే గతంలో సాక్షికి, ఆంధ్రజ్యోతికి మధ్య ఇలానే ప్రారంభమయ్యాయి. కానీ జగన్ అర్కేకు కేసీఆర్ అంత మిత్రుడు కాదు. ఇక కవితతో జరిగిన డిబేట్ విషయంలో ఆర్కే కే ఎక్కువ లాభం జరిగింది. కవిత ఆర్ డిబేట్ కి వెళ్లి ఉండకపోతే బాగుండు అని టిఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నాయి. కానీ ఆమెకు చెప్పే ధైర్యం ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం తమ కుటుంబాన్ని మొత్తం కార్నర్ చేసిందని, తెలంగాణ ప్రజలు తమకు అండగా ఉండాలని కవిత చేసిన విజ్ఞప్తి గాలికి కొట్టుకుపోయే పేల పిండి అయింది. ఏతావాతా ఏ జర్నలిస్టు ముందైనా ధైర్యంగా మాట్లాడే కవిత ఆర్కే ముందు మాత్రం తలవంచింది. అదే ఈ డిబేట్ ద్వారా నిరూపితం అయింది.
Also Read:Vijay Devarakonda: మైక్ టైసన్ బూతులు తిట్టేవాడు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
[…] Also Read: Kavitha vs ABN RK: కవిత వర్సెస్ ఏబీఎన్ ఆర్కే.. ఇంత… […]
[…] Also Read:Kavitha vs ABN RK: కవిత వర్సెస్ ఏబీఎన్ ఆర్కే.. ఇంత… […]