
CM Jagan vs Ramoji Rao : మీడియా మొఘల్.. టైకూన్.. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారంలోనూ ముందు వరుసలో కూర్చున్న పెద్దమనిషి. నాడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్ కూడా ఏమీ చేయలేని పత్రికాధినేత. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడా మార్చేసిన ఘనత.. సీఎంలను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని మీడియా ఆడించిన మహా మనిషి.. దేశంలోనే అత్యున్నత పురస్కారం పొందిన పెద్దాయన ఇప్పుడు జగన్ దెబ్బకు మంచం పట్టాడు. అవును మంచం పట్టేలా చేశాడు జగన్.
అంతటి అమిత్ షాను ఇంటికి పిలిపించుకున్న ఘనత ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుది.. నరేంద్ర మోడీ సైతం వంగి నమస్కారం చేసిన ఘనత ఈయనది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు చుక్కలు చూపించిన సత్తా రామోజీది.. కానీ అంతటి ఘనమైన వారసత్వం కలిగి ఉన్న ఈ మీడియా మొగల్ మంచానికే పరిమితం కావడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసింది.
జగన్ దెబ్బకు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మంచం పట్టేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా టచ్ చేయలేని పెద్దమనిషిని జగన్ కూకటి వేళ్లతో సహా పెకిలించి వస్తుంటే ఏమీ చేయలేక అంపశయ్యపై పడిపోయినట్టు రామోజీ ఇప్పుడు మార్గదర్శి కేసులో విచారణ వేళ బెడ్ పై నిస్సహాయంగా పడిపోయాడు.

చెట్టంత కొడుకు సుమన్ చనిపోతే ఆ గుండె కుంగిపోలేదు, రాజశేఖర్ రెడ్డి మార్గదర్శి విషయంలో బయటకి లాగితే భయపడలేదు, తన ఆత్మబంధువు కన్నుమూస్తే అతడు విచలితుడు కాలేదు.. కానీ ఇప్పుడు రామోజీకి ఏమయింది? పచ్చళ్ళు, పేపర్ కాంబినేషన్లో వేల కోట్లు సంపాదించిన మీడియా మొగల్ ధైర్యం ఎందుకు సన్నగిల్లింది? జగన్ ఆ స్థాయిలో దెబ్బ కొట్టాడా? అంటే ఔననే చెప్పక తప్పదు. ఎందుకంటే మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజలను ఈరోజు హైదరాబాద్ లోని వారి నివాసాల్లో ఏపీ సీఐడీ భారీ బృందం విచారిస్తోంది. ఇలా విచారణను ఎదుర్కోవడం బహుశా ఆయన జీవితంలోనే తొలిసారి కావచ్చు. అందుకే భయపడిపోయి మంచాన పడిపోయారు. జగన్ కొడుతున్న దెబ్బకు నిస్సహాయంగా మంచాన పడి విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. జగన్ నిజంగానే రామోజీ పునాదులను పెకిలించి వేస్తున్నాడా? ఆర్థిక స్తంభాలను కూల కొడుతున్నాడా? వీటికి ఔననే సమాధానాలు వస్తున్నాయి.
వయసు మళ్ళింది, రక్తం పలుచబడిపోయింది, నిసత్తువ ఆవరించింది.. ఈ ముక్తాయింపులు ఇప్పుడు వినిపిస్తాయేమో గాని.. అవి దీర్ఘ కాలంలో నిలబడలేవు. అలాంటి స్థితి కనుక ఉంటే ఈటీవీ భారత్ ను రామోజీరావు ఎందుకు ప్రవేశపెడతాడు? ఓం సిటీని ఎందుకు కడతాడు? ఒకే సారి 6 ఛానెల్స్ ఎందుకు మొదలుపెడతాడు? ఇంతటి తెగువ ఉన్నప్పటికీ ఎందుకు కూల పడిపోయాడంటే… జగన్ కొట్టిన దెబ్బ అలా సాలిడ్ గా ఉంది.. అందుకే ఇలా మంచాన పడితే మార్గదర్శి విచారణ తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక రామోజీ మంచాన ఉన్న వదలకుండా విచారిస్తున్నారని సానుభూతి కూడా ఆయనపై మొగ్గేలా ఇటు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు రామోజీరావు టార్గెట్ ఒకటే.. మార్గదర్శి కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళాలి..కానీ జగన్ ఉన్నంత వరకూ దాన్ని వదలడు. ఆయనను హింసించిన రామోజీని వేటాడుతూనే ఉంటాడు.
సిఐడి విచారణ వేళ రామోజీరావు అనారోగ్యం విషయం తెరపైకి రావడం నిజంగా ఆశ్చర్యకరం.. అది కూడా నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ ద్వారా తెలపడం మరింత అనూహ్యమనే చెప్పాలి. విచారణ కోసమే పెద్దాయన ఇలా మంచానపడి నాటకాలు ఆడుతున్నాడా? అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతైనా అంతటి మీడియా మొఘల్ ను మంచాన పడేసిన జగన్ ను ‘నువ్వు మొగాడివి స్వామీ’ అంటూ ప్రత్యర్థులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.