Nandamuri Balakrishna: తండ్రి పేరు తీసేసిన నాలుగు రోజులకు కానీ ఆయన పుత్రరత్నం బాలయ్య పౌరుషం రాలేదంటే ఎక్కడో తేడా కొడుతోంది. అల్లుడు చంద్రబాబు గిల్లాడా? లేక మనవడు జూనియర్ ఎన్టీఆర్ పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్నాడో ఏమో కానీ లేట్ అయినా లేటెస్ట్ గా మన బాలయ్య బాబు స్పందించారు. ‘హెల్త్ యూనివర్సిటీకి’ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టిన ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేశాడు.

బాలయ్యబాబు ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించాడు.ఇప్పటికే ఎన్టీఆర్ పేరు మార్పుపై బయట అంతా రచ్చ జరుగుతున్న వేళ బాలయ్య ఇంత లేట్ ఒక కార్టూన్ తో రియాక్ట్ అవ్వడమే చర్చనీయాంశమైంది. బాలయ్య పోస్ట్ చేస్తూ ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. చభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త… అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’’ అంటూ బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఒక ఘాటు మెసేజ్ పోస్ట్ చేశాడు.

బాలయ్య ఈ మెసేజ్ ద్వారా అటు వైఎస్ఆర్ ను.. ఇటు జగన్ ను ఏకిపారేశాడు. తండ్రి వైఎస్ఆర్ గద్దెనెక్కాక ఎయిర్ పోర్టు పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి ఏకంగా యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని అన్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలు ఉన్నారని బాలయ్య స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాడు.

ఇక ఎన్టీఆర్ దయతో ఎదిగిన వైసీపీ నేతలను విశ్వాసం లేని కుక్కలు అంటూ బాలయ్య పరుష పదజాలం వాడాడు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని అటు జగన్ ను .. ఇటు తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వైసీపీ చేరిన వారిని బాలయ్య తూర్పార పట్టారు. ప్రస్తుతం బాలయ్య మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా బాలయ్య వేసిన పంచుల ప్రవాహం ఇప్పుడు జగన్ కు, వైసీపీకి కాస్త గట్టిగానే తగిలింది..