
AtmaSakshi Andhra Survey : ఏపీలో ఓ సర్వే కలకలం రేపుతోంది. అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ప్రతిపక్షాలకు సాంత్వన చేకూరుస్తోంది. కానీ ఆ సర్వే ఫలితాల పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సర్వే నిబద్ధత పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నిజంగా చేశారా ? ఓ అంచనాతో ఫలితాలు విడుదల చేశారా ? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
ఆత్మసాక్షి పేరున విడుదలైన సర్వే ఏపీలో సంచలనం సృష్టించింది. ఆ సర్వే ఫలితాల పై జనంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ సర్వే పై అసలు స్పందించలేదు. కానీ కొందరు లోలోపన మధనపడుతుంటే.. ఇంకొందరు మురిసిపోతున్నారని తెలుస్తోంది. ఆత్మసాక్షి సర్వేలో ప్రధానంగా తెలుగుదేశం, జనసేన పొత్తు విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే.. 115 నుంచి 120 స్థానాలు అలవోకగా గెలుస్తారని సర్వేలో వెల్లడించారు. ఇదే సమయంలో బీజేపీతో కలిస్తే.. టీడీపీ, జనసేన ఓటమి మూటగట్టుకుంటాయని పేర్కొన్నారు. నాలుగు కాంబినేషన్లతో సర్వే ఫలితాలు విడుదల చేయగా.. నాలుగింటిలో మూడు కాంబినేషన్లలో జనసేన, టీడీపీ విజయం సాధిస్తుందని వెల్లడించారు.
ఆత్మసాక్షి సర్వే ఫలితాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం జగన్ వైనాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేతకు వయసు మీద పడుతోంది. నారా లోకేష్ సామర్థ్యం అనుకున్న స్థాయిలో లేదు. ఇక జనసేన తన పరిధి మేరకు ప్రభావం చూపుతుంది. ఇలాంటి విభిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన అలయన్స్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్టు ఆత్మసాక్షి అంచనా వేయడం అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా చెప్పవచ్చు. తెలుగుదేశానికి ఉన్న బలహీనతలతో మళ్లీ తమదే అధికారమని వైసీపీ భావిస్తోంది. కానీ ఇప్పుడు ఆత్మసాక్షి ఫలితాలు వైసీపీ కంటగింపుగా మరాయి.
ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే నిబద్ధత పై ప్రశ్నల వర్షం కురుస్తోందని చెప్పవచ్చు. ఆత్మసాక్షి నిజంగా క్షేత్రస్థాయిలో తిరిగి శాంపిల్స్ సేకరించిందా ? నియోజకవర్గాల వారీగా ప్రజలను కలిసిందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా.. కేవలం తమ అంచనాను సర్వే ఫలితాలుగా ప్రజల్లోకి వదులుతున్నారా ? అన్న సందేహానికి తావిస్తోంది. ఆత్మసాక్షి పేరిట కేవలం ఒక పేపర్ ను విడుదల చేశారు. అందులో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సర్వే చేశారో పేర్కొనలేదు. ఏ నియోజకవర్గంలో ఎంత మందిని సర్వే చేశారో కూడా చెప్పలేదు. శాంపుల్స్ ఏ ప్రాతిపదికన తీసుకున్నారో కూడా వెల్లడించలేదు. కేవలం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే సంఖ్యను విడుదల చేశారు.
ఆత్మసాక్షి పూర్తీ వివరాలతో సర్వే విడుదల చేసి ఉంటే నమ్మదగినదిగా ఉండేది. ప్రశ్నించడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తడానికి వారు విడుదల చేసిన సర్వే సరైన ఫార్మాట్ లో లేకపోవడమే అని చెప్పవచ్చు. ఆత్మసాక్షి సర్వే పూర్తీ స్థాయిలో విడుదల చేసి ఉంటే ప్రజలకు నమ్మకం పెరిగేది. నిజంగా వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఉంటే వాటి పూర్తీ స్థాయి వివరాలను ఇప్పుడైనా మీడియా ముందు ఉంచాలి. అప్పుడే వారి పై , వారి సర్వే పై నమ్మకం కుదురుతుంది. లేదంటే అది ఆత్మసాక్షి అంచనా మాత్రమే .. నిజమైన సర్వే కాదని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.