Pawan Janasena Leaders bail: విశాఖపట్నంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడమే ఆలస్యం అధికార వైసీపీ ఉక్కుపాదం మోపింది. ఆయనను పోలీసులతో కార్నర్ చేసింది. అష్టదిగ్గంధనం చేసి హోటల్ కే పరిమితం చేసింది. జనసేనానిపై నోరుపారేసుకున్న వైసీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారంటూ 61మంది జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విడుదల చేసేదాకా కదలనంటూ పవన్ కళ్యాణ్ విశాఖలోనే తిష్ట వేశారు. అరెస్ట్ అయిన జనసేన నేతల కోసం న్యాయపోరాటానికి దిగారు.

పవన్ పోరాట ఫలితంతో ‘న్యాయమే’ గెలిచింది. విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్ట్ అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో భారీ ఊరట లభించింది. అరెస్ట్ అయిన 61 మందిని రూ.10వేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో 9మందికి ఈనెల 28 వరకూ రిమాండ్ విధించింది. 9 మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు.
అంతకుముందు పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండి.. పోలీసులు నోటీసులు ఇచ్చినా కదలకుండా పోరాడుతుండడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో హైడ్రామా నడుమ పోలీసులు జనసేన నేతలను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు.
ఇక మొత్తం 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్ట్ చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని.. 61 మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో చివరకు జనసేన తరుఫునే న్యాయం గెలిచి చాలామందిని విడుదల చేశారు. ఇంకో 9 మంది మాత్రమే మిగిలారు. వారి కోసం హైకోర్టుకెక్కేందుకు జనసేన రెడీ అయ్యింది. పవన్ న్యాయపోరాటంతో జనసైనికులు విడుదల కాబోతుండడం విశేషం.