FIFA World Cup 2022 : 2022 ఫిఫా ప్రపంచకప్ లోనే పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భీకర అర్జెంటీనా జట్టు గ్రూప్ సిలో పసికూన అయిన అత్యంత బలహీన సౌదీ అరేబియా జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పుట్ బాల్ ప్రపంచాన్ని ఈ మ్యాచ్ షాక్ కు గురిచేసింది.

భీకర ఫామ్ తో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి కూడా అర్జెంటీనాను గట్టెక్కించలేకపోవడం చూసి ఆ దేశ అభిమానులు బోరున ఏడ్చారు. కలలో కూడా ఊహించని పరాజయానికి చింతించని వారు లేరు.ప్రపంచకప్ చరిత్రలోనే ఇదో అతిపెద్ద సంచలనాల్లో ఒకటి అని క్రీడాలోకం అభివర్ణిస్తోంది.
ఫిఫా ప్రపంచకప్ 2022లో మంగళవారం స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గ్రూప్ సి మ్యాచ్ లో సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్లో 2-1 తేడాతో ఓడిపోయింది. మెస్సీ ఫస్ట్ హాఫ్ లోనే గోల్ చేసినప్పటికీ అర్జెంటీనా జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 46 మ్యాచ్ లలో ఓడిపోని రికార్డుకు బ్రేకులు పడ్డాయి. ఇటలీ 37 వరుస విజయాలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ రికార్డును అర్జెంటీనా బ్రేక్ చేసేది.
ప్రపంచకప్ కొడుతుందనుకుంటున్న జట్టు తొలి మ్యాచ్ లోనే ఇలా ఓడడంతో అర్జేంటీనా అభిమానులు తట్టుకోలేకపోయారు. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో గత 36 మ్యాచ్ లలో ఓటమి ఎరుగని అర్జెంటీనాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. అది కూడా అత్యంత బలహీన సౌదీ అరేబియా చేతిలో కావడంతో వాళ్ల బాధ వర్ణనాతీతంగా మారింది.
అర్జెంటీనా ఓటమిలో.. సౌదీ గెలుపులో కీలకంగా వ్యవహరించింది సౌదీ గోల్ కీపరే. పదే పదే అర్జెంటీనా ప్లేయర్లు గోల్స్ తో దాడి చేసినా ఒక్క గోల్ తప్పితే మిగతా ఏగోల్ కూడా కాకుండా అతడు అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో సౌదీ చేసిన రెండు గోల్స్ ను అర్జెంటీనా ప్లేయర్లు సమం చేయలేక చతికిలపడ్డారు.
ప్రపంచంలోనే నంబర్ 1 జట్టు అర్జెంటీనాపై విజయంతో సౌదీ అరేబియా సంబరాలు అంబరాన్నంటాయి. ఏకంగా ఆ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అన్నింటికి సెలవులు ఇచ్చి సౌదీ ప్రభుత్వం సంబరాలు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిందంటే ఆ దేశానికి ఇది ఎంత పెద్ద విజయమో అర్థం చేసుకోవచ్చు.