Union Budget 2023 AP: రాష్ట్రం నిట్టనిలువునా చీల్చి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇప్పటికీ రెవెన్యూ లోటు భర్తీ కోసం దేహీ అంటూ అర్థిస్తోంది. చట్టంలోని హామీల అమలు కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. కానీ పాలక ప్రభుత్వం గల్లీలో పులి.. ఢిల్లీలో పిల్లి అన్నట్టు వ్యవహరిస్తోంది. ఉత్తర కుమార ప్రగల్భాలతో కాలాన్ని వెళ్లదీస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగలేక పిల్లిమొగ్గలేస్తోంది. కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈసారైనా ఏపీ పై కేంద్రం కరుణ చూపేనా ? అన్న చర్చ జరుగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి తొమ్మిదేళ్లు గడుస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగా మారాయి. ఏపీ పునర్విభజన చట్టాన్ని పాలకులు గాలికి వదిలేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి అవే డిమాండ్లు, అవే వినతులు. పాడిందే పాటరా పాసిపళ్ల దాసిగా అన్నట్టు ఏపీ పాలకుల పరిస్థితి తయారైంది. న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడంలో పూర్తీగా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను గట్టిగా ప్రశ్నించే పరిస్థితి లేదు. పాలకుల స్వకార్యం కోసం ప్రజల ప్రయోజనాలు నిస్సిగ్గుగా తాకట్టుపెట్టారు. ఏపీలో మెడలు వంచుతామని ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఢిల్లీ వెళ్లగానే అప్రయత్నంగా ఏపీ పాలకుల మెడలు వంగిపోతాయి. ఇలాంటి పాలకులు ఉన్న ఏపీకి ఏళ్లనాటి హామీలు నెరవేరుతాయా అన్న ప్రశ్న ప్రజలకు కలుగక మానదు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ కూడా గంపెడాశలతో ఎదురుచూస్తోంది. ఉమ్మడి ఏపీ విభజనతో విభజిత ఏపీ రెవెన్యూలోటు రాష్ట్రంగా మారిపోయింది. దీంతో రెవెన్యూలోటు భర్తీ చేస్తామంటూ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూలోటు భర్తీ కాలేదు. కనీసం ఇప్పుడైనా రెవెన్యూ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందా ? అన్న ఆశతో ఏపీ ఎదురుచూస్తోంది. జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో నిధులు కేటాయిస్తామని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ హామీ నెరవేరలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం వినతిపత్రాలతో సరిపెడుతుంటే.. కేంద్రం ప్రభుత్వం చేస్తాం.. చూస్తాం అంటూ కాలయాపన చేస్తోంది.

విశాఖకు మెట్రో రైలు, జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు నిధుల కోసం ఏపీ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా, పోలవరం గురించి చెప్పనక్కర్లేదు. తొమ్మిదేళ్ల నుంచి అడిగి.. అడిగి ఏపీ గొంతు ఎండిపోయింది. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ బడ్జెట్లో నైనా డిమాండ్లు నెరవేరుతాయా ? అన్న ఆశ ఏపీ ప్రజల్లో ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. వాటి ప్రకారం జీఎస్టీ రీఎంబర్స్మెంట్, ఆదాయపన్నుమినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం రీఎంబర్స్మెంట్ కోసం ఏపీ ఎదురుచూస్తోంది.
ఏపీ పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వైసీపీ ప్రభుత్వమే కారణమని చెప్పకతప్పదు. ఎందుకంటే చట్టంలోని హామీలను అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్నిగట్టిగా అడగలేకపోతోంది. ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని నిగ్గదీసి ప్రశ్నించలేకపోతోంది. ఇదంతా ఏపీ ప్రభుత్వ వైఫల్యం కాక ఇంకేమని చెప్పాలి. ఢిల్లీ పాలకుల ముందు సాగిలపడటం తప్పా ఏపీ పాలకులకు మరో విషయం తెలియదు. జగన్ పై సీబీఐ కేసుల దర్యాప్తు నడుస్తున్నంత కాలం కేంద్రాన్ని ప్రశ్నించలేరు. ఇదే అదునుగా కేంద్ర పెద్దలు కూడా ఏపీని చూసీచూడనట్టు వదిలేస్తారు. ఇక కేంద్ర పెద్దలు కరుణ చూపితే బడ్జెట్లో ఏపీకి నాలుగు మెతుకులు రాలుతాయి. లేదంటే మరో బడ్జెట్ కోసం ఎదురుచూపులే మిగులుతాయి.