ABN RK – Balakrishna : లోగుట్టు ‘బాబు’కే ఎరక : ఏబీఎన్ ఆర్కేకు, బాలయ్యకు సంధి కుదిరిందోచ్..

ఇక మిగతాది అంటారా అది ఎప్పుడో బయటపడుతుంది. అప్పటికి జనం మర్చిపోతుంటారు కాబట్టి. దానిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు.

Written By: NARESH, Updated On : January 5, 2024 9:38 pm
Follow us on

ABN RK – Balakrishna : కొందరి మధ్య వైరాలు ఎందుకు మొదలవుతాయో తెలియదు. కానీ అవి చినికి చినికి గాలి వాన లాగా మారుతాయి. ఫలితంగా తీవ్రమైన మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. కనీసం ఎదురుపడితే పలకరింపునకు కూడా నోచుకోలేని పరిస్థితులను కల్పిస్తాయి. మొన్నటిదాకా ఓ పత్రిక అధిపతికి, ఓ సినీ నటుడు కం రాజకీయ నాయకుడికి ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే ఎన్నికల ముంగిట ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపి వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగిపించారని.. అందుకే ఆ పత్రిక యజమాని పేపర్లో ఆ సినీ నటుడికి సంబంధించిన వార్తలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆ పత్రికాధిపతి ఎవరు? ఇద్దరి మధ్య గొడవ ఎందుకు ప్రారంభమైంది? అది ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది? ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..

ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణకు నందమూరి కుటుంబం మీద మొదటి నుంచి ఒక రకమైన భావన. అప్పట్లో ఒక వియ్యానికి సంబంధించి ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో అప్పటినుంచి నందమూరి కుటుంబం మీద రాధాకృష్ణ పెద్దగా ఆసక్తి చూపించడని టాక్ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు అంటే రాధాకృష్ణకు విపరీతమైన విధేయత ఉంటుంది. అందుకే ఆయన పత్రికలో చంద్రబాబుకు అత్యంత సానుకూలంగా వార్తలు వస్తూ ఉంటాయి.. అయితే ఈ చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ గతంలో ఒక సమావేశంలో వేమూరి రాధాకృష్ణ మీద ఏవేవో మాటలు అన్నాడట.. అవి రాధాకృష్ణ చెవికి చేరాయట.. ఇక అప్పటినుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో బాలకృష్ణ వార్తలపై నిషేధం మొదలైంది. బాలకృష్ణకు సహజంగానే నోరు మీద అదుపు ఉండదు. అలాగని రాధాకృష్ణ శుద్ధ పూస కాదు. ఆయన కూడా అదే బాపతు. కాకపోతే రాధాకృష్ణను బాలకృష్ణ ఏమన్నాడనేది ఇంతవరకూ బయటి ప్రపంచానికి తెలియదు. కాకపోతే బాలకృష్ణ మీద ఆంధ్రజ్యోతి సంస్థల్లో కొంతకాలం నుంచి నిషేధం కొనసాగుతోంది.

ఇటీవల నారా లోకేష్ యువ గళం ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ప్రియారిటి ఇచ్చిన ఆంధ్రజ్యోతి.. నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలను అసలు రాయలేదు. కనీసం ఆయన ఫోటో కూడా అచ్చు వేయలేదు. అయితే ఈ పరిణామంపై టిడిపిలో అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీకి కరపత్రం గా ఉండే ఆంధ్రజ్యోతిలో నందమూరి బాలకృష్ణ ఫోటో, ఆయన మాట్లాడిన మాటలు రాకపోవడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇవి చంద్రబాబుకు గట్టిగా వినిపించడంతో.. ఈసారి నేరుగా ఆయనే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అటు బాలకృష్ణకు, ఇటు రాధాకృష్ణకు సర్ది చెప్పడం వల్ల పరిస్థితిని శాంతంగా మార్చారు అనే టాక్ నడుస్తోంది. ఇక చంద్రబాబు చెప్పిన మాటలతో ఏకీభవించిన రాధాకృష్ణ తన కోపాన్ని తీసి గట్టుమీద పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లే తన పత్రికకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లలో ‘బాలకృష్ణ మీద నిషేధం ఎత్తివేశాం. ఇకపై ఆయనకు సంబంధించిన వార్తలు యధా విధంగా ప్రచురించవచ్చు’ అని ఆదేశాలు జారీ చేశారు.

ఇక చంద్రబాబు మధ్యవర్తిత్వం వల్ల శాంతి ఒప్పందం కుదుర్చుకున్న బాలకృష్ణ.. వెంటనే ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి స్పాన్సర్ గా వ్యవహరించాలని ముందుకు వచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం లో అఖిల భారతీయ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీకి తోడ్పాటు అందించేలాగా బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదివారం హిందూపురంలో ఆంధ్రజ్యోతి_ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించనున్నారు. సో మొన్నటిదాకా బాలకృష్ణ అనే పేరు ఎత్తితేనే చీత్కరించుకున్న ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు ఏకంగా ఆయన అభిమానుల ఆధ్వర్యంలోనే ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది. అంతేకాదు బాలకృష్ణపై పాజిటివ్ వార్తలు కూడా రాస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య జరిగిన కోల్డ్ వార్ లో ఎవరు శత్రువులు? ఎవరు మిత్రులు? దీని గురించి బాలకృష్ణ చెప్పలేడు. రాధాకృష్ణ రాయలేడు. స్థూలంగా అది ఒక మిస్టరీ .. దాని ఛేదించింది చంద్రబాబు నాయుడు. ప్రస్తుతానికి అయితే ఇదే మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక మిగతాది అంటారా అది ఎప్పుడో బయటపడుతుంది. అప్పటికి జనం మర్చిపోతుంటారు కాబట్టి. దానిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు.