HomeజాతీయంAI Fraud: కృత్రిమమేధ ప్రమాద ఘంటికలు ఈసారి నెట్టింట: మొహం మార్పిడితో కోట్లు కొట్టేశాడు !

AI Fraud: కృత్రిమమేధ ప్రమాద ఘంటికలు ఈసారి నెట్టింట: మొహం మార్పిడితో కోట్లు కొట్టేశాడు !

AI Fraud: ఎవడు సినిమా చూశారా మీరు? అందులో చనిపోయిన అల్లు అర్జున్ మొహాన్ని తనకు పెట్టుకుని పగ సాధిస్తాడు రామ్ చరణ్! సరే ఇదంతా సినిమాల్లో వర్కౌట్ అవుతుంది.. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏకంగా మొహం మార్చి కోట్లు కొల్లగొట్టాడు ఓ మోసగాడు. ఇంతకీ అలా ఎలా చేశాడో మీరూ చదివేయండి.

మోసానికి ఉపయోగిస్తున్నారు

పూర్వం విఠలాచార్య సినిమాలో ఎంతైతే ఫాంటసీ ఉండేదో.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతకుమించి ఫాంటసీ మనుషుల జీవితంలోకి దూసుకు వచ్చింది. అయితే ఈ టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే పెద్ద నష్టం లేదు. కానీ కొంతమంది దీని ద్వారా మోసపూరితమైన పనులు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రజలు తమ జీవితాన్ని మరింత సులభతరం చేసుకుంటున్నారు. వ్యాసాలు, కవితలు, కోడ్ భాషలు సరళీకరించడం, లేదా వాటిని వివరించడం, సంగీతాన్ని కంపోజ్ చేయడం మరెన్నో వాటి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. అయితే కాలక్రమేణా ప్రజలు సాంకేతికతను తప్పుడు పనులు చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

డీప్ ఫేక్ ద్వారా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేథ మాత్రమే కాదని .. దీనిని ఉపయోగించి మనుషులను మోసం కూడా చేయవచ్చని ఉత్తర చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి నిరూపించాడు..డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఏకంగా ఐదు కోట్లకు ఒక వ్యక్తిని మోసం చేశాడు.. డీప్ ఫేక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక టూల్. ఇది నకిలీ చిత్రాలు, వీడియోలను సృష్టిస్తుంది. తప్పుడు సమాచార వ్యాప్తికి ఉపయోగపడుతుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఉత్తర చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి డీప్ ఫేక్ ఆధారంగా “ఏఐ_ పవర్డ్ ఫేస్_ స్వాపింగ్ టెక్నాలజీ” ఉపయోగించి మరొక వ్యక్తికి సన్నిహిత స్నేహితుడిగా నటించాడు. వీడియో కాల్ చేసి తనకు అత్యంత అవసరం ఉందని 4.3 మిలియన్ యువాన్ లను(5 కోట్లు) తన ఖాతాకు బదిలీ చేయమని కోరాడు.. దీంతో ఏం అవసరం వచ్చిందో అనుకొని బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎక్కడో మోసం జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా నిందితుడు మోసం చేశాడు అని గ్రహించి అసలు విషయాన్ని బయటపెట్టారు.

కొత్త కాదు

ఇలాంటి మోసాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఒక యువకుడి గొంతును క్లోన్ చేసేందుకు స్కామర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. అమెరికా దేశం అరిజోనా ప్రాంతానికి చెందిన జెనిఫర్ డిస్టా ఫానో అనే మహిళకు ఒకరోజు తనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో ఆమె 15 సంవత్సరాల కూతురు స్టీయింగ్ ట్రిప్ వెళ్ళింది. ఆమె ఫోన్ తీయగానే.. తన కూతురు ఏడుపు తో అమ్మా అని పిలవడం విన్నది. ఆ తర్వాత నీ కూతురు నీకు కావాలి అంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని ఒక పురుష గొంతు ఆమెను బెదిరించింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ సుఖాంతం అయింది. వాస్తవానికి ఆమె కూతురు కిడ్నాప్ నకు గురి కాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మోసగాళ్లు ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టినట్టు పోలీసులు తమ దర్యాప్తులో తెలుసుకున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version