Google Hyderabad : అమెరికా తర్వాత గూగుల్ హైదరాబాద్ ను ఎందుకు ఎంచుకుంది?

అయితే గూగుల్ నిర్మిస్తున్న కొత్త క్యాంపస్ వీటన్నింటి కంటే చాలా పెద్దది. ఈ క్యాంపస్ నిర్మాణం కోసం 7.3 ఎకరాల స్థలాన్ని గూగుల్ 2019 లోనే కొనుగోలు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 11:30 am
Follow us on

Google Hyderabad : అమెరికాలో సిలికాన్ వ్యాలీ.. ఇండియాలో బెంగళూరు.. ఐటీ పేరు చెబితే చాలామందికి ఇవే గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు బెంగళూరు స్థానాన్ని క్రమేపి హైదరాబాద్ ఆక్రమించేస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం.. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో తెలంగాణ రాజధాని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. విస్తారంగా భూములు.. విలువైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ అతి త్వరలో భారత దేశ ఐటీ రాజధానిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఇతర దేశాలకు చెందిన పెద్ద ఐటీ కంపెనీలు బెంగళూరు ప్రాంతంలో కార్యకలాపాలు సాగించేవని.. కానీ ఇప్పుడు అవి తమ గమ్యస్థానాన్ని హైదరాబాద్ వైపు మళ్ళించుకున్నాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం బెంగళూరు స్థాయిని మించి ఐటీ లో వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో బహుళ జాతి సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు అమల్లో పెట్టాయి కూడా.

అమెరికాకు చెందిన అతి పెద్ద బహుళ జాతి కంపెనీ గూగుల్.. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాదులో నిర్మిస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో మూడు మిలియన్ చదరపు అడుగుల భవనంలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది మార్చిలో క్యాంపస్ నిర్మాణం కోసం గూగుల్ కొత్త డిజైన్ ఆవిష్కరించింది. ” అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత.. ఒక డిజైన్ ను ఎంపిక చేసాం. ఇది అద్భుతమైన నైపుణ్యం కలిగిన నిపుణులకు ఆహ్లాదకరమైన పనితీరు కల్పిస్తుంది. అన్ని విధాలుగా సహకరించే కార్యశాలగా ఉంటుంది. అనుకూలమైన వనరులను ఇక్కడ కల్పించాం. రాబోయే కాలంలో గూగుల్ హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలుస్తుంది” అని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది..

ఇక గూగుల్ క్యాంపస్ నిర్మాణాన్ని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల సందర్శించారు. క్యాంపస్ నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గూగుల్ మాత్రమే కాకుండా హైదరాబాద్ అనేక బహుళ జాతి సంస్థల క్యాంపస్ ల నిర్మాణానికి నిలయమంటే అతిశయోక్తి కాక మానదు.
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మైక్రోసాఫ్ట్.. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించింది. న్యూ జెర్సీలో ఐటీ కార్యకలాపాలు సాగించే కమ్వాల్ట్ అనే ఐటి కంపెనీ.. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ నిర్మాణాన్ని హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసింది. ఐర్లాండ్ లోని డబ్లిన్ నగరానికి చెందిన యాక్సెంచర్ అనే ఐటీ కంపెనీ హైదరాబాదులోని రహేజా మైండ్ స్పేస్ సెంటర్ లో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం చేపట్టింది. 2009 నుంచి ఇక్కడ అది కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికాలోని మసాచు సెట్స్ ప్రాంతానికి చెందిన వర్చుసా అనే కంపెనీ హైదరాబాదులో మాదాపూర్ ప్రాంతంలో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం చేపట్టింది. అమెరికాకు చెందిన డీ ఎక్స్ సీ టెక్నాలజీ అనే కంపెనీ హైదరాబాదులోని హుడా టెక్నో ఎన్ క్లేవ్ లో అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది. ఇది మాత్రమే కాకుండా దేశీయంగా దిగ్గజ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టిసిఎస్, వ్యాల్యూ ల్యాబ్స్, హెచ్ సీఎల్ టెక్, కెల్టన్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కూడా హైదరాబాదులో అతిపెద్ద క్యాంపస్ లను కలిగి ఉన్నాయి. అయితే గూగుల్ నిర్మిస్తున్న కొత్త క్యాంపస్ వీటన్నింటి కంటే చాలా పెద్దది. ఈ క్యాంపస్ నిర్మాణం కోసం 7.3 ఎకరాల స్థలాన్ని గూగుల్ 2019 లోనే కొనుగోలు చేసింది.