ABN RK -BRS- BJP : కొద్దిరోజులుగా నిప్పు ఉప్పులాగా పోరాటం చేసుకున్న కారు, కమలం పార్టీలు కలిసిపోయాయా? పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయా? అందుకే కేసిఆర్ బిజెపి నాయకుల మీద విమర్శలు చేయడం లేదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం అదేనా? ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అని సమాధానం చెబుతున్నారు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. వారం వారం తన పత్రికలో కొత్త పలుకు పేరిట వద్ద మన రాజకీయాలపై విశ్లేషణలు రాసే ఆయన.. ఈసారి పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీద పడ్డారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ అనుకూల వార్తలు రాస్తున్నారు. కాంగ్రెస్ కోణంలోనే మొన్న జరిగిన జాతీయస్థాయి విపక్షాల భేటీకి ప్రధమ ప్రాధాన్యమిచ్చారు. అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభిస్తే దానిని రెండవ ప్రాధాన్య వార్తగా వేశారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రాధాకృష్ణ ఉద్దేశం ఏమిటో.
ఇక కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కారు కమలం పార్టీ కలిసిపోయాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిని ధ్రువపరిచే విధంగా ఆరోపణలు చేస్తోంది. అయితే వీటన్నిటికీ బలం చేకూర్చుతూ రాధాకృష్ణ చాలా లోతుల్లోకి వెళ్లి పలు కీలక విషయాలు వెల్లడించారు.. రాజకీయ పార్టీలు అంటే స్వాములోరి మఠాలు కావని, అవి కూడా పరస్పర ప్రయోజనాల కోసమే పని చేస్తాయని రాధాకృష్ణకు తెలియదా? ఈ విషయం తెలియకుండానే ఆయన ఒక పత్రిక నడుపుతున్నారా? సుదీర్ఘకాలం టిడిపి బీట్ రిపోర్టింగ్ చేశారా? మరి ఆ లెక్కన అప్పట్లో మోదిని విభేదించిన చంద్రబాబు 23 సీట్లకు పరిమితం కాలేదా? తర్వాత ఇప్పుడు కాళ్ళ బేరానికి రాలేదా? దాని గురించి రాధాకృష్ణ ఎందుకు మాట్లాడడు? ఇలా మనం గనుక ప్రశ్నిస్తే రాధాకృష్ణ దగ్గర సమాధానం ఉండదు. సరే ఆ విషయాలను పక్కనపెడితే.. ఒకసారి ఆయన రాసిన కొత్త పలుకు గురించి ఒక్కసారి పరిశీలిస్తే..
” ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా.. తెలంగాణలో బిజెపి నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎటువంటి అవగాహన ఏర్పడిందో తెలియదు కానీ.. ఇప్పటివరకు తెలంగాణలో అధికారంలోకి రావాలని సమరోత్సాహంతో పనిచేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. లిక్కర్ స్టాంలో కవిత విషయంలో హడావిడి చేసిన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు మౌనం వహించడంతో హస్తిన లో ఏం జరిగిందో అర్థం కాక బిజెపి రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు” అని రాధాకృష్ణ ఎటువంటి దాపరికం లేకుండానే రాసుకోవచ్చు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొద్దిరోజులు హడావిడి చేసిన కేంద్ర ఏజెన్సీలు.. తర్వాత సైలెంట్ అయిపోయాయి.. కవితలు రెండు మార్లు విచారణకు పిలిపించిన ఈ డి తర్వాత సైలెంట్ అయిపోయింది. లిక్కర్ స్టాంలో శరత్ చంద్ర రెడ్డి అప్రవర్ గా మారిపోయినప్పటికీ ఇప్పటివరకు కవిత మీద చర్యలు తీసుకోకపోవడం కేంద్ర పెద్దల మీద ఒకింత అనుమానాలకు తాపిస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని రాధాకృష్ణ ఎటువంటి మొహమాటం లేకుండా వ్యక్తం చేశారు. ” తన పార్టీతో బిజెపి లోపాయికారి అవగాహన కుదుర్చుకుందని భారత రాష్ట్ర సమితి నేతల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయని రాధాకృష్ణ ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టారు.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు గానీ.. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదని, కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన పర్వాలేదన్న ధోరణితో తమ పార్టీ పెద్దలు ఉండడాన్ని బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చారు.. దీనివల్లే బిజెపిలో ఉండేది ఎవరు? పోయేది ఎవరు ? అనే పరిస్థితి ఏర్పడిందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ముస్లింల్లో క్రమేపి మార్పు వస్తోందని, మొదట వారు భారత రాష్ట్ర సమితికి అండగా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రాధాకృష్ణ హస్తం అనుకూల రాతలు రాశారు.. ఆ మధ్య రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఎటువంటి ఒప్పందం కుదిరిందో తెలియదు గానీ ఆనాటి నుంచి ఆయన కాంగ్రెస్ పల్లవి అందుకున్నారు.. రేవంత్ రెడ్డి ఎలాగూ చంద్రబాబు మనిషి కాబట్టి తన పత్రికలో ఆయనకు అపరిమితమైన ప్రాధాన్యమిస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆదివారం రాసిన కొత్త పలుకులో కొన్ని విషయాలు పక్కన పెడితే మిగతావన్నీ కాంగ్రెస్ ట్యూన్ లోనే సాగాయి.
” తెలంగాణలో ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే. బిజెపి కాంగ్రెస్ పార్టీలలో కేసీఆర్ ను ఢీకొట్టే ప్రధాన పక్షం ఏది? ఈ విషయం మీద ఒక స్పష్టత కావాలి” అని రాధాకృష్ణ ప్రశ్న సంధించారు. కానీ ఈ లెక్కన చూసుకుంటే ప్రతిపక్షాలనేవి తమ పాత్రను పోషిస్తాయి. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఆధారంగా తమ పోరాటాలు సాగిస్తాయి. అలాంటప్పుడు కేసీఆర్ మీద ఎవరు పోరాడుతారో అని రాధాకృష్ణ అల్టిమేటం ఇవ్వడం ఏమిటో అంతు చిక్కని ప్రశ్న. ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద పోరాడాలని బిజెపి నాయకులకు రాధాకృష్ణ పిలుపునిస్తారు. ఇదే సమయంలో జగన్ కు ప్రత్యామ్నాయం చంద్రబాబు అని స్పష్టం చేస్తారు.. మరి ఇదే సూత్రం తెలంగాణకు కూడా వర్తిస్తుంది కదా! కాంగ్రెస్ నుంచి ఎటువంటి లోపాయికారి ఒప్పందం కుదిరిందో తెలియదు కానీ.. రాధాకృష్ణ రాతల్లో కాంగ్రెస్ పల్లవి కనిపిస్తోంది.. ఒకటి రెండు విషయాలు తప్ప మిగతావన్నీ కాంగ్రెస్ అనుకూల కోణంలోనే కొత్త పలుకు సాగిపోయింది.. అన్నట్టు ముస్లింలు కాంగ్రెస్ వైపు మరలితే.. క్రిస్టియన్ ఓటర్లు ఆ పార్టీ వైపే ఎందుకు చూస్తారు? అంటే ముస్లింలు చెప్పారు కాబట్టి క్రిస్టియన్లు అటు వెళ్తున్నారా? ఇలాంటి లాజిక్ లేని వాక్యాలు ఈ వారం కొత్త పలుకులో చాలానే ఉన్నాయి.