Homeజాతీయ వార్తలుGujarat Elections 2022 : పట్టణాల్లో చీపురు.. గ్రామీణ ప్రాంతాల్లో హస్తం: గుజరాత్ పోరులో కమలానికి...

Gujarat Elections 2022 : పట్టణాల్లో చీపురు.. గ్రామీణ ప్రాంతాల్లో హస్తం: గుజరాత్ పోరులో కమలానికి సంకటం

Gujarat Elections 2022 : 27 ఏళ్ళు… వరుస విజయాలు.. ప్రత్యర్థి పార్టీని దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. కేంద్రంలో రెండోసారి అధికారం.. అత్యధిక రాష్ట్రాల్లోనూ అధికారం.. అయినప్పటికీ ఇవేవీ కమలానికి అంత సాంత్వన కలిగించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. మరి కొద్ది రోజుల్లో గుజరాత్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది.. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేరింది.. దీంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చాప కింద నీరులా ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతున్నట్టు సర్వే సంస్థలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో యువకులు ఆ పార్టీకే జై కొడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకు పోతోంది.. అయితే మొన్నటిదాకా విజయంపై ఎంతో విశ్వాసంతో ఉన్న బిజెపి.. ఇప్పుడు కొంత మేర ఆందోళనలో ఉంది. అయితే హిందుత్వకు దూరంగా ఉంటున్న బిజెపి ఈసారి తెరపైకి కొత్త అంశాలను తెస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. పదే పదే ఆమ్ ఆద్మీ పార్టీ హిందుత్వ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో బిజెపి ప్లాన్ బి విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. కేంద్ర హోం శాఖ మంత్రి గోద్రా అల్లర్ల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. స్మృతి ఇరానీ శ్రద్ధా వాకర్ విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నది. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో గాంధీ కుటుంబం లేకుండా ఆ పార్టీ నాయకులు ప్రచారం సాగిస్తుండటం విశేషం.

వ్యతిరేక ఓటు చీలిపోదా?

ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని తొలుత అందరూ భావించారు. అయితే ఆప్ ప్రభావం పట్టణ ఓటర్ల పై ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చిన తర్వాత.. ఈ అభిప్రాయంలో మార్పు వస్తున్నది. కాంగ్రెస్ కు గ్రామీణ ప్రాంతాల్లో బలం ఎక్కువగా ఉంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన 41.44% ఓట్లలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. బిజెపి మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించి అధికారం దక్కించుకుంది. అయితే ప్రస్తుతం పోటీలోకి దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందని పునులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కడో తేడా కొడుతోంది

27 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ తమపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండదని, తమదే అధికారం అని కమలనాధులు చెబుతూ వచ్చారు.. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నా తమకు ఏమీ కాదనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును, కాంగ్రెస్ ఓట్లనే ఆమ్ ఆద్మీ పార్టీ చీలుస్తుందని భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో బిజెపి నాయకులు కొంత ఆందోళనలో ఉన్నారు.. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చినా… బిజెపి సీట్లు తగ్గుతూ ఉన్నాయి. కాంగ్రెస్ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. 182 స్థానాల అసెంబ్లీలో 2002లో 127 సీట్లు దక్కించుకున్న బిజెపి.. 2007లో 117 సీట్లకు తగ్గింది. 2012లో 115 కు చేరింది. 2017లో 99 స్థానాలకు పడిపోయింది.. 2017లో పోటీ చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది.. అయితే ఈ ఐదు సంవత్సరాలలో మారిన పరిణామాలతో నేపథ్యంలో బలమైన శక్తిగా అవతరించింది. ఉచిత విద్యుత్తు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి సామాన్య ప్రజలకు అవసరమైన పథకాలతో ప్రచారం సాగిస్తోంది.. అయితే అంతర్గతంగా ప్రమాద సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో బిజెపి నష్ట నివారణ చర్యలకు దిగింది. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రచారం చేస్తున్నది.

మోడీ కౌంటర్ ఎటాక్

అయితే పరిస్థితి ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ లో బిజెపిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని తలంపుతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు.. గతంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారని ఆయన చెబుతున్నారు. ఢిల్లీలోని బాట్లా హౌస్ లో ఎన్కౌంటర్ జరిగి ఉగ్రవాదులు మరణిస్తే కాంగ్రెస్ నాయకులు కన్నీరు కార్చారని మోడీ గుర్తు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ ఏర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందని పరోక్షంగా విమర్శిస్తున్నారు. మొత్తానికి గుజరాత్ పోరు లో ఈసారి విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version