TS Liquor Policy: మందు అమ్మేటోళ్లు.. తాగేటోళ్లు మంచోళ్లు.. తాగనోళ్లే చెడ్డోళ్లు..!

దేశంలో ఏ రాష్ట్రంలో తాగనంత మద్యం తెలంగాణలోనే తాగుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనంత మంది తాగుబోతులు తెలంగాణలోనే ఉన్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వారి హయాంలో మద్య నిషేధం అమలు చేశారు.

Written By: Raj Shekar, Updated On : August 21, 2023 12:25 pm

TS Liquor Policy

Follow us on

TS Liquor Policy: ఈ శీర్షిక చూడగానే.. ఏదో తేడాదా ఉంది అనిపిస్తుంది కదూ. నిజమే తేడాగానే ఉంది.. తేడాగానే రాశాం. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో ఇవే చదువుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో మద్యం అమ్మకాలు.. షాపులకు వస్తున్న దరఖాస్తులు.. మద్యం తాగేవారు పెరుగుతున్న తీరు చూస్తుంటే.. మరో ఐదేళ్ల తర్వాత ఇదే కొటేషన్‌ చెప్పుకోవడం ఖాయం.

తెలంగాణలోనే తాగుబోతులు ఎక్కువ..
దేశంలో ఏ రాష్ట్రంలో తాగనంత మద్యం తెలంగాణలోనే తాగుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనంత మంది తాగుబోతులు తెలంగాణలోనే ఉన్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వారి హయాంలో మద్య నిషేధం అమలు చేశారు. కానీ తెలంగాణను చూస్తే వారి నిర్ణయం తప్పు అనాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్‌ పాలసీనే గ్రేట్‌ అని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే.. మద్యంతో వచ్చే డబ్బులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. అంతలా కేసీఆర్‌ ప్రజలతో మద్యం తాగిస్తున్నారు.

ఒకప్పుడు ఇలా..
ఒకప్పుడు మద్యం తాగేవారు 5 శాతం ఉండేవారు. గుట్టుగా మందు తాగేవారు. తాగనివారంతా శీతల పానీయాలు తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటే.. మద్యం తాగేవారు దొంగతనంగా చాటుమాటుగా తాగేవారు. కానీ నేడు మద్యం తాగేవారు బహిరంగంగా తాగుతున్నారు. తాగనివారు ఒక గదిలో మూలన కూర్చోవాల్సిన పరిస్థితి. ఇక మద్యం అమ్మేవారిని గొప్పగా, తాగేవారిని గ్రేట్‌గా, బార్‌ యజమానులను గ్రేటెస్ట్‌గా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో చూస్తారు కూడా.

టెండర్ల తో కోట్ల రూపాయలు..
తెలంగాణలో మద్యం దుకాణాలకు కోట్ల రూపాయలు టెండర్‌కే ఖర్చు చేశారు. 2,500 మద్యం షాపులకు లక్షలకు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. ఈ దరఖాస్తుల ద్వారా సుమారు 2 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ఇక మరో విశేషం ఏమిటంటే.. దరఖాస్తు దారుల్లో 25 శాతం మంది మహిళలే ఉండడం. ఒకప్పుడు మద్యం తాగేవారిని అసహ్యించుకునే మహిళలు ఇప్పుడు మద్యం అమ్మడానికి ముందుకు రావడం గమనార్హం.

మారిన పాలకుల వైఖరి..
ఇక పాలకుల వైఖరి కూడా మారుతోంది. మద్య నిషేధం నుంచి మద్యం అమ్మకాలు పెంచేలా మారిపోయారు. నీతులు చెప్పిన నేతలే ఇప్పుడు మద్యం ఎక్కువగా తాగించాలని చూస్తున్నారు. తెలంగాణ మద్యం వ్యాపారంలోకి ఢిల్లీ, ఆంధ్రా ప్రాంత నేతలు కూడా దిగడమే ఇందుకు నిదర్శనం.