HomeజాతీయంKamkhyadevi Temple History సండే స్పెషల్ : ఆ ఆలయంలో మూడు రోజులు రక్తస్రావం.. యోని...

Kamkhyadevi Temple History సండే స్పెషల్ : ఆ ఆలయంలో మూడు రోజులు రక్తస్రావం.. యోని పూజ చేసే ఏకైక దేవాలయం అదే!

kamkhyadevi temple history : ఆదిదంపతులైన శివసతులు ఒకరి సమక్షంలో ఒకరు గడిపిన స్థలం అది, శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆమె యోని భూమిపై పడడంతో, ఏర్పడ్డ 51 శక్తి పీఠాలలో ఒకటిగా మారిన ప్రదేశం అది. ఇక్కడి ఆలయం గోడల నుంచి ఏటా జూన్‌లో రక్తం స్రవిస్తుంది. ఆలయంలో సిద్ధం చేసిన చీరలు రక్తమయం కావడం, వాటిని అమ్మవారి ప్రసాదంగా భావించడం లాంటి ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇక ఏ తాంత్రికుడు అయినా ఎంత సాధన చేసిన ఈ క్షేత్రాన్ని దర్శించనీదే పూర్తిస్థాయి తాంత్రికుడుగా మారలేడు. ఇన్ని విశేషాలు ఉన్న ఈ కామాఖ్య ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఇప్పుడు తెలుసుకుందాం.

-స్థల పురాణం..
కామాఖ్య ఆలయం మూలాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్థలపురాణం తెలుసుకోవాలి. తనకు ఇష్టం లేని వివాహం చేసుకున్న కారణంతో ప్రజాపతి దక్షుడు తన కూతురు అల్లుడు అయిన సతీదేవి–మహాదేవున్ని ఒకరోజు యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. వెళ్లడం ఇష్టం లేకపోయినా పుట్టిన ఇల్లుపై మమకారంతో సతీదేవి యజ్ఞానికి వెళుతంది. అక్కడ దక్షుడు మహాదేవుని అవమానించడమే కాకుండా శివనింద చేస్తాడు. తన భర్త నిందించడం తన నిందించడంగా భావించి సతీదేవి అప్పటికప్పుడు అగ్నిప్రవేశం చేసి ఆత్మార్పణ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన మహాదేవుడు అత్యంత వినాశకరమైన ఆగ్రహానికి గురవుతాడు. తన రౌద్ర రూపం అయిన వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి అంతం చేసేందుకు పంపిస్తాడు. తను అగ్నికి ఆహుతి అవుతున్న సతీదేవి శరీరాన్ని చేతుల పైకి తీసుకొని తన కర్తవ్యమని జగద్రక్షణ మానివేసి ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. సతీ వియోగంతో విపరీతమైన మనోవ్యధకు గురవుతాడు. దీనిని గమనించిన దేవతలందరూ మహాశివుడిని మళ్లీ కార్యోన్ముఖులను చేసేందుకు ఏదైనా చేయాలని శ్రీమహావిష్ణువుని వేడుకుంటారు.

-సతీదేవిపై సుదర్శన చక్రం ప్రయోగం..
దేవతల విన్నపం మేరకు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. దాంతో ఆమె శరీరం 51 ఖండాలుగా వెలువడి భూమిపై వివిధ ప్రదేశాలలో పడుతుంది. ఇలా పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా మారుతుంది. ఈ క్రమంలో ఆమె యోని భాగం ఇప్పటి గువాహతికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంచల్‌ అనే ఒక చిన్న కొండపై పడుతుంది. అదే ఇప్పటి కామాఖ్య ఆలయం.

-విగ్రహం లేని ఆలయం..
ఇక్కడ చిత్రం ఏమిటి అంటే ఆలయంలో ఎటువంటి విగ్రహం, ప్రతిమలు ఉండవు. ఆలయంలోపల ఒక రాతి గుహ ఉంటుంది. గుహ లోపల ఒక బండరాయిపై సహజసిద్ధంగా ఏర్పడిన ఒక స్త్రీ యోని ఆకారం కనిపిస్తుంది. భక్తులు పూజాదికాలు కూడా ఈ యోని ఆకారానికి చేస్తారు. ఈ గుహ లోపల గోడలు ఎప్పుడూ చెమతో ఉంటాయి. మాత కాళీ, మాత త్రిపుర సుందరి, మాత కామాఖ్య, ఈ ముగ్గురు దేవతలు తాంత్రికులకు ముఖ్య ఆరాధ్యులు.

-ప్రతీ జూన్‌లో రక్తస్రావం..
ఇక ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన విషయం ఏమిటి అంటే ప్రతీ సంవత్సరం జూన్‌లో గుహ లోపల గోడలకు మూడు రోజులపాటు రక్తం స్రవిస్తుంది. ఒకసారి స్రావం ఎంత అధికంగా ఉంటుంది అంటే పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు కూడా ఎరుపు రంగు పులుముకుని ఉంటాయి. ఈ మూడు రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ మూడు రోజులలో ఆలయంలో ఉంచిన చీరలన్నీ రక్తంతో తడవడం వాటిని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించడం ఇక్కడ చూడవచ్చు. కామాఖ్య మాత నెలసరి రుతుక్రమంలో భాగంగానే ఈ మూడు రోజులు గుహ లోపల రక్తం స్రవిస్తుందని భక్తులు చెబుతారు. శాపం కారణంతో తన శక్తిని కోల్పోయిన కామ దేవుడు కూడా ఈ క్షేత్రంలోనే అమ్మవారి కోసం తపస్సు చేసి తిరిగి తన శక్తిని పొందాడు అని చెబుతారు.

-తాంత్రికుల పూజలు..
ప్రపంచంలోనే నలుమూలల నుంచి తాంత్రికులు ఇతర సాధువులు నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే ముక్తిని ప్రసాదించే దేవతగా కామాఖ్య అమ్మను భక్తులు చెబుతారు. సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఆరోగ్యం బాగా లేని వారు ఇక్కడకు వస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

51 శక్తి పీఠాలలో ఒకటిగా పిలవబడే ఈ ఆలయం చుట్టూ ఏదో ఒక తెలియని శక్తి వలయం ఉంటుందని, ఆలయ సందర్శన చేసిన భక్తులకు నూతన ఉత్తేజం శక్తి వస్తుందని ఆలయాని సందర్శించిన భక్తులు చెబుతారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular