Saddula Bathukamma 2022: కూలే సవుడు మిధ్దెలు
వాలే ఎర్ర మట్టి పెడ్డలు
రాలే జాజుల అలుకులు
కారే తెల్లటి కోడీక గీతలు
జారే పచ్చటి సాంపి వాకిళ్ళు
కాటుక నలుపు కటిక పేదరికం
పగిలిన పసుపు పచ్చని పాదాలతో పదనిసలు
ఇదే కదా బతుకమ్మా..
నా దేశ ఆత్మ గౌరవం నడుస్తున్న పూలవనమై
బతుకునీయడానికొస్తుంటే
ఆ నడిచే నవ చైతన్యమే కదా బతుకమ్మా
ఆ పూల పరిమళమే కదా సరదాల దసరమ్మా..
ఎంతకాలం నిను కన్నీటితో వెతకాలమ్మా ఓ బతుకమ్మా
ఓ బతుకమ్మా..ఇంకా ఇంకా బతుకమ్మా..!!!
బతికి బతికించవమ్మా ఓ బతుకమ్మా..!!
తంగేడు పూలు, కట్ల పూలు, గునుగు, గుమ్మడి పూలు.. ఇలా ప్రకృతి ప్రసాదించిన విరులతో బతుకమ్మ హొయలు పోయేది. గౌరమ్మ చుట్టూ అందంగా అల్లుకొని అమ్మ లక్కల చేతిలో ఒడుపుగా ఒదిగేది. వెయ్యినోళ్ళ పాటలతో దేదీప్యమానంగా వెలిగేది. ఇదీ సద్దుల బతుకమ్మ ఠీవీ. ఊరుకు బతుకమ్మే ఠీవీ.

పువ్వులేవి
సద్దుల బతుకమ్మ నాటికి ఏ ఊరి శివారులో చూసినా విరగబూసిన గునుగు, తంగేడు, పట్టుకుచ్చుల పూలతో శోభాయ మానంగా కనిపించేవి. తెల్లారగట్ల అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు భుజాలకు సంచులు తలగించుకుని చేన్లు, చెలకలు, గుట్టల వెంట తిరిగి మూటల కొద్ది పూలు తెచ్చేవాళ్ళు. వాటితో మధ్యాహ్నం ఇంటిల్లిపాది పోటీపడి పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైపోయింది. బతుకమ్మకు కీలకమైన తంగేడు, గునుగు పూలకు కొరత ఏర్పడింది. కాలక్రమేణా గుట్టలు, జంగిళ్ళు, చెలకలు తగ్గిపోయాయి. ఫలితంగా ఆ పువ్వులు కనుమరుగైపోయాయి. కూలీల కొరత వల్ల చేన్లలో కలుపు నివారణ మందులు కొట్టడంతో గునుగు, పట్టుకుచ్చుల, ఇతర గడ్డి జాతుల మొక్కలు అంతరించిపోతున్నాయి. తంగేడు పువ్వు లేని సద్దుల బతుకమ్మను ఊహించలేం. అని రాష్ట్రంలో గ్రానైట్ క్వారీల కోసం గుట్టలన్నీ నాశనం అయిపోయాయి. బీడు భూములను రియల్టర్లు ప్లాట్లుగా మారుస్తుండడంతో తంగేడు మొక్కల జాతి అంతరించిపోతోంది.
గత సంవత్సరం శాతవాహన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నిర్వహించిన పరిశోధనలో పలు విస్మయకరమైన వాస్తవాలు తెలిసాయి. ఇందుకు తగినట్టుగానే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో తంగేడు పూలు రావడం తగ్గిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ లోని గడ్డి అన్నారం పూల మార్కెట్లో 30 రూపాయలు ఇస్తే బతుకమ్మకు సరిపడా పువ్వు వచ్చేది. ఇప్పుడు 300 పెట్టినా ఒక్క చుట్టుకు రావడం లేదు. గ్రామాల్లో కూడా తంగేడు పువ్వు దొరకడం లేదు. తో చాలామంది రోడ్ల పక్కన పెరిగే హైబ్రిడ్ తంగేడు చెట్ల పువ్వులను తెచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. గతంలో పట్టణంలో బతుకమ్మ పండుగ ముందు ట్రాక్టర్ల కొద్దీ గునుగు, తంగేడు పువ్వులు తెచ్చి అమ్మకానికి పెట్టేవాళ్ళు. ఈసారి అది మోపుల్లో కూడా కనిపించడం లేదు. దీంతో ఏ పువ్వులు కొందామన్నా రేట్లు మస్తు ఫిరం అయిపోయినయి.

ఏడాది క్రితం వంద రూపాయలకు లభ్యమైన గునుగు మోపు.. ఈసారి 500 దాకా పెరిగింది. పిడికెడు కూడా కట్టను వంద నుంచి 150 దాకా అమ్ముతున్నారు. ఇక కరీంనగర్ లో అయితే ఒక వరుసకు కావలసిన తంగేడు పువ్వు 300 దాకా పలికింది. రెండు వరసలకు కావలసినంత సీతమ్మ జడ పువ్వు 400 దాకా పలుకుతుంది. రైతులు ఇష్టానుసారంగా కలుపు నివారణ మందులు పిచికారి చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వ్యాపారులు అంటున్నారు. ఇక ఈ పూలకు కొరత ఉండటంతో మార్కెట్లలో ఎటు చూసినా తోటల్లో సాగుచేసిన బంతిపూలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బతుకమ్మ పేర్చిన తర్వాత పై దండ గా వేయడానికి బంతిపూలను వాడేవారు. కానీ ఇప్పుడు ఏ పువ్వులు కూడా లేకపోవడంతో, పెద్ద సంఖ్యలో బంతిపూలను తీసుకొచ్చి వాటిని దండగా కుచ్చి వాటి మధ్యలో తంగేడు, సీత జడ పువ్వులను కుచ్చుతున్నారు. పోనీ బంతిపూల ధర ఏమైనా తక్కువ ఉందంటే.. కిలో 300 దాకా పలుకుతుంది. పెరిగిన పూలరెట్ల వల్ల ఒక మోస్తరు బతుకమ్మను తీర్చేందుకు పైగా ఖర్చు అవుతుందని మహిళలు అంటున్నారు.
ఎంతటి ప్రకృతి విధ్వంసం
గత పదేళ్లలో సుమారు మూడు వేలకు పైగా క్వారీలు ఏర్పడ్డాయి. ఈ క్వారీలు సృష్టించిన విధ్వంసం వల్ల చాలావరకు వృక్ష జాతులు కనుమరుగైపోయాయి. కారణంగా తంగేడు వంటి మొక్కజాతి ఇది ఎత్తైన ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. ఎంతటి కరువు పరిస్థితులైన ఎదుర్కొంటుంది. సిసాల్ఫినేసీ కుటుంబానికి చెందిన అనేక ఆయుర్వేద మందుల్లో వాడుతారు. పైగా ఈ పువ్వు కు ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ పూలల్లో మకరందం పాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల తేనెటీగలు విస్తృతంగా వాలుతాయి. ఈ మకరందాన్ని గ్రహించి ఏర్పరచిన తుట్టెల్లో ఎక్కువ తేనె ఉంటుంది. కానీ క్వారీలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రకృతి చక్రం మొత్తం గతి తప్పిపోయింది. ఫలితంగానే పువ్వులనే పూజించే పూల పండుగకు పువ్వులు లేకుండా పోయాయి.
Also Read:KCR National Party- AP: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఎలా ఉండబోతుంది?