5 State Election Results : ‘బీజేపీ’ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతుందని.. ఇక రాజకీయం మొదలుపెడుదామని తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వారు బోలెడు ఆశలు పెంచుకున్నారు.యూపీలో బీజేపీ ఓడిన మరుక్షణం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిద్దామని అనుకున్నారు. ఇక ఏపీలోని జగన్ సైతం బీజేపీ ఓడిపోతే.. పొత్తుల సంసారంలో ఏపీ ఎంపీ సీట్లు కీలకమై రాష్ట్రానికి అంతో ఇంతో నిధులు తీసుకురావచ్చని ఆశించారు. అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ ఓడిపోవాలని బలంగా అనుకున్నాయి.

ప్రాంతీయ పార్టీలన్ని కూడా ఇలా అనుకుంటే ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారు. ప్రధాని మోడీపై నమ్మకం ఉంచారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో ఎంతో వ్యతిరేక ఉన్నా కూడా అక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టారంటే ఇక మరోసారి కేంద్రంలో కమలం పార్టీకే రావడం ఖాయం అని తేలిపోయింది. కేసీఆర్, జగన్ సహా చాలా ప్రాంతీయ పార్టీలకు ఈ పరిణామం మింగుడు పడని వైనంగా మారింది.
తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఎదుగుతోంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీలో కేసీఆర్ కు షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అటూ ఇటూ అయితే ఆ పార్టీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనే ప్రత్మామ్మాయం దిశగా కేసీఆర్ ఆలోచించారు. కానీ ఇప్పుడా ఆ ఆశలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తుంచేశాయి.
ఇక ఏపీలోనూ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావద్దని.. బీజేపీ ఓడిపోతే రాజధాని కూడా లేని అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు నిధులు తీసుకురావచ్చని జగన్ ఎంతగానో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం జగన్ ఆశలపై నీళ్లు చల్లింది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఊపు ఖచ్చితంగా తెలంగాణ, ఏపీలోని బీజేపీ శ్రేణులకు ఊపునిస్తుంది. తెలంగాణలో అధికారం దిశగా దూకుడుగా ముందుకెళుతున్న బండి సంజయ్ వర్గానికి ఇది కొండంత బలాన్ని ఇస్తుంది. కేంద్రంలోని సమీకరణాలను అనుకూలంగా మలుచుకొని తెలంగాణలోనూ రెచ్చిపోవడానికి బీజేపీ రెడీ అయ్యింది.
ఇక ఏపీలోనూ బీజేపీ బలంగా పుంజుకునేందుకు ఈ ఫలితాలు బూస్ట్ లా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఏపీలోని సమస్యలు, జగన్ సర్కార్ హిందూ వ్యతిరేక చర్యలపై సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ పెద్దలు పోరాటాలు చేశారు.ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో ఏపీ బీజేపీకి జోష్ రావడం ఖాయం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం దిశగా.. ఏపీలో జనసేనతో కలిసి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
[…] […]