5 State Election Results 2022: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీకి ఎదురు లేదని నిరూపించాయి. ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీకి అవకాశాలు లేవని భావించినా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తోంది. కానీ పంజాబ్ లో మాత్రం అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయపథంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతోంది. దేశంలో కాంగ్రెస్ పతనం పతాక స్థాయికి చేరుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అయిదు రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.

ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో విజయంసాధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో చక్రం తిప్పుతామని చెబుతున్న కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి వారు కూడా తమ ప్రాంతం దాటి రాలేదు. కానీ అరవింద కేజ్రీవాల్ మాత్రం అటు ఢిల్లీతోపాటు ఇటు పంజాబ్ లో సత్తా చాటి తానేమిటో నిరూపించుకున్నారు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే సత్తా ఆయనకే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రస్థానం ఇక ముగిసినట్లే అని సర్వేలు సైతం సూచిస్తున్నాయి.
Also Read: యూపీలో బీజేపీ ఊపు.. రైతులు ఉద్యమించిన పశ్చిమ యూపీలోనూ ప్రభంజనం
అయిదు రాష్ట్రాల్లో కనీసం ఒక్క చోట కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఇదివరకే అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. గోవాలో కూడా కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని చూసినా అక్కడా నిరాశే మిగిలింది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక లాగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా నిజమయ్యాయి. సర్వేలు సూచించిన విధంగానే ఫలితాలు కూడా రావడం తెలుస్తోంది.

పంజాబ్ లో 117 స్థానాలుండగా 62 స్థానాల్లో ఆప్ విజయపథంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. కానీ అధికారానికి మాత్రం దూరంలోనే ఉండిపోయింది. పార్టీ స్వయంకృతాపరాధంతోనే రోజురోజుకు దిగజారిపోయినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అవలంభించే విధానాలు ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నట్లు సమాచారం. దీంతోనే పంజాబ్ లో ఆప్ కు అధికారం కట్టబెట్టినట్లు చెబుతున్నారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ చేపడుతున్న పరిపాలన ప్రజలకు నచ్చేలా ఉంటోంది. అందుకే ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్ లో పాగా వేసిన ఆప్ ఇకపై మిగతా రాష్ట్రాల్లో కూడా తన ప్రభావం చూపించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆప్ దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీగా నిలవనుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.
Also Read: కేంద్రం కూడా అమరావతి విషయంలో బుక్కైనట్టేనా?