Homeజాతీయ వార్తలు2022 Roundup- Telangana BJP: 2022 రౌండప్ : బీజేపీకి కలిసొచ్చిన ఏడాది.. తెలంగాణాలో దూకుడు.....

2022 Roundup- Telangana BJP: 2022 రౌండప్ : బీజేపీకి కలిసొచ్చిన ఏడాది.. తెలంగాణాలో దూకుడు.. అదొక్కటే లోపం!

2022 Roundup Telangana BJP: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి 2022 కలిసి వచ్చింది. ఈ ఏడాది ప్రదర్శించిన దూకుడు ఆ పార్టీకి మంచి మైలేజీ తెచ్చింది. అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని భావించే స్థాయికి ఎదిగింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ప్రయత్నాలు, దూకుడు, పాదయాత్రలు కలిససి వచ్చాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక పరాజయం బీజేపీకి నిరాశ కలిగించింది. అయినా.. ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బీజేపీ దూకుడును మరింత పెంచింది.

2022 Roundup Telangana BJP
Bandi Sanjay

 

-సమస్యలపై పోరుబాట..
2022 వ సంవత్సరంలో బిజెపి సాగించిన ప్రయాణం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలు, ప్రజాగోస బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్‌సభ ప్రభాస్‌ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో 2022 సంవత్సరంలో సక్సెస్‌ అయింది. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై దృష్టిసారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

-ప్రజల్లోకి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు..
2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్‌ అరెస్ట్‌ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పక్షాన 317 జీవో సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికీ ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది.

-రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బీజేపీ దీక్షలు..
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా భీమ్‌ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్‌ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే, వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న క్రమంలో, బడ్జెట్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ బడ్జెట్‌ సెషన్‌ మొత్తం వారిని సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించడంతో బీజేపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్‌పై స్టే ఇవ్వటం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో సక్సెస్‌ అయ్యారు.

2022 Roundup Telangana BJP
2022 Roundup Telangana BJP

-సంగ్రామ హోరు..
ప్రజా సంగ్రామ యాత్రలతో హోరెత్తించిన బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం మూడు విడతల పాదయాత్రను సాగించిన బండి సంజయ్‌ అనేక నియోజకవర్గాలలో ప్రజల మద్దతును కూడగట్టారు. జనగామ జిల్లాలో బండి ప్రజా సంకల్ప పాదయాత్ర లో బీజేపీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య బాహాబాహీ చోటుచేసుకోవడంతో బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఆపై బండి సంజయ్‌ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్‌లో బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బీజేపీ కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. మొత్తంగా మూడు విడతల ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించారు.

2022 Roundup Telangana BJP
2022 Roundup Telangana BJP

-‘సాలు దొర.. సెలవు దొర’ క్యాంపెయిన్‌
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్టుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా అనేకమార్లు తెలంగాణలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించి తెలంగాణ దృష్టిని ఆకర్షించారుు. ఇక ‘సాలు దొర సెలవు దొర’ అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్‌ క్యాంపెయిన్‌ కూడా తెలంగాణలో ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.

-మునుగోడులో ఓడినా తగ్గని దూకుడు..
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ వీరోచిత పోరాటం చేసింది. ఫలితం నిరాశపర్చినా.. కమలనాథుల దూకుడు మాత్రం తగ్గలేదు. మునుగోడు పరాజయాన్ని పక్కనపెట్టి బీజేపీ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరంలో చాలా వరకు సక్సెస్‌ అయిందని చెప్పాలి. ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి, ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular