
YS Viveka : సంచలనంగా మారిన ఏపీ మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన అనుచరులైన సునీల్ రెడ్డి, ఉదయ్ తదితర 300 మందిని పైగా విచారించింది. కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. ఇంతకీ సీబీఐ ఏం ప్రశ్నలు సంధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా వివేకా హత్యకు చుట్టూనే సీబీఐ ప్రశ్నలు వేసింది. అందుకు గల కారణాలను అనుమానితులుగా భావిస్తున్న వారికి సంధించింది. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత వివాదాలు, సాక్ష్యాలు ఎందుకు చెరిపేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే చేశారు వంటి ప్రశ్నలను వేయడం జరిగింది. ఆ పది ప్రశ్నలను ఒకసారి పరిశీలిస్తే..
1. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారు..?
2. సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చింది..?
3.వివేకా గాయాలు కన్పించకుండా బ్యాండేజ్ ఎందుకు వేశారు?
4. హత్య జరిగిన రోజు ఉదయ్‌కుమార్ రెడ్డి మీ ఇంట్లో ఎందుకున్నారు?
5.సునీల్‌యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో మీకున్న సంబంధమేంటి..?
6. హత్య రోజు ఇంట్లోనే ఉండి..ఎక్కడో ఉన్నానని ఎందుకు చెప్పారు..?
7. వివేకానంద/రెడ్డితో మీకు విభేదాలున్నాయా..?
8. రూ.40 కోట్ల డీల్‌పై మీరేమంటారు..ఫండింగ్ చేసిందెవరు..?
9. మీరు చెబితేనే హత్య చేశామని దస్తగిరి చెబుతున్నాడు కదా..?
10. ఇన్నాళ్లూ లేని వివాహేతర సంబంధాల ప్రస్తావన ఇప్పుడెందుకు తీసుకొచ్చారు..? ముఖ్యంగా ఉన్నాయి.
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాత ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్పటికి ఐదుసార్లు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈ రోజు మరలా ఆయన సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆయన బెయిల్ పిటీషన్ ను తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది. విచారణకు ఆయన సహకరించడం లేదని సీబీఐ కోర్టు దృష్టకి తీసుకెళ్లగా, విచారణకు సహకరించాలని కోర్టు పేర్కొంది. సీబీఐ అధికారుల ప్రశ్నలను లిఖితపూర్వగా తెలియజేయాలని, అవినాష్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సూచించింది.
అంతకుముందుకు నాలుగుసార్లు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డికి సీబీఐ పలు ప్రశ్నలు వేసింది. హత్య కేసులో నిందితుడు, ఆ రోజు సాయంత్రం, ఆ తరువాత మీ ఇంట్లో ఎందుకున్నాడు? నిందితులకు మీ ఇంట్లో ఏం పని? హత్య జరిగిన రోజు ఉదయం సీఎం సతీమణి భారతికి ఎందుకు కాల్ చేశారు? ఫోన్‌లో ఏం మాట్లాడారని అడిగినట్లు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తరువాత, తనను అరెస్ట్ చేయొద్దంటూ పదేపదే అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. సీబీఐకి ఆయన ఏం సమాధానాలు ఇస్తున్నారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.