Snakes: ఈ భూమండలం మీద విషం ఉన్న జంతువులలో పాము ఒకటి.. పాములు ఎదురుపడితే ఎవరైనా సరే భయపడి పోతారు. కొందరైతే ఆత్మ రక్షణ కోసం వాటిపై దాడి చేసి చంపేస్తారు. ఎందుకంటే పాము విషం అత్యంత ప్రమాదకరమైనది. కొన్ని పాములకు విషం లేకపోయినప్పటికీ.. అవి తోకతో గట్టిగా కొడతాయి. కొండచిలువ లాంటి పాములైతే అమాంతం మింగేస్తాయి. అందుకే పాములకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.. వాస్తవానికి పాములు ఎదురుపడినా, లేక అదే పనిగా పగ పట్టినా నేరుగా పరిగెత్తకూడదట. “S” ఆకారంలో పరుగులు తీయాలట.. ఇలా చేస్తే సర్పం నుంచి దూరం ఏర్పడుతుందట.. అలా అది చుట్టూ తిరిగేందుకు ఎక్కువ టైం తీసుకుంటుందట. ఇలాంటి విధానం పాము నుంచి వారిని వారు కాపాడుకునేందుకు తోడ్పడుతుందట. పాము నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో… గత ఐదు సంవత్సరాలుగా పాముల కదలికలపై పరిశోధనలు చేస్తున్న కీత్ టేలర్ కీలక విషయాలు వెల్లడించాడు.
పాములు అస్సలు దాడులు చేయవు. పామను కొట్టడం లేదా బెదిరించడం లాంటిది చేస్తే అది వెంటనే ఎదురు తిరుగుతుంది. అలాంటి సమయంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పాము రూపాన్ని చూసి పారిపోవాలనిపిస్తుంది. అయితే పాము ఒకవేళ ఎదురైనప్పుడు దాని నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతే, దానంతట అదే వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఈ భూమి మీద ఎలాంటి పామైనా సరే ఎదురుదాడి చేయదు. పాముల నుంచి తప్పించుకునేందుకు చాలామంది “S” నమూనా మార్గంలో పరిగెత్తాలని చెబుతున్నారు. కానీ, అది సరైన విధానం కాదని టేలర్ అంటున్నాడు. వాస్తవానికి పాములు తమ దిశను వెంటనే మార్చుకుంటాయట. “S” నమూనా మార్గంలోనూ వేగంగా పరిగెత్తుతాయట. అలాంటప్పుడు పాము నుంచి కాపాడుకోవాలంటే దాని నుంచి దూరంగా వెళ్లడమే ఉత్తమమట. ఎట్టి పరిస్థితుల్లోనూ పామును ఉత్తేజితం చేసే పనులు చేయకూడదట. అలాంటి సమయంలో పాము అయోమయానికి గురవుతుందట. ఏం చేయాలో తెలియక, ఎదురు దాడికి దిగుతుందట. ఒకవేళ పాము కాటు వేస్తే మంత్రాలు తంత్రాలు అని ఆలస్యం చేయకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పాము కాటు వేస్తే చాలామంది మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. నిమ్మకాయలు, తాయతులు అంటూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ అవి మంచిది కాదట. పాము కాటు వేసినప్పుడు కచ్చితంగా వైద్య సహాయం పొందాలి. పాము విషానికి విరుగుడుగా వైద్య చికిత్సను తీసుకోవాలి. అప్పుడే పాము విషం శరీరం పై ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడొచ్చు. ఒకవేళ మంత్రాలు, తంత్రాలు అంటూ ఆలస్యం చేస్తే విషం శరీరం మొత్తం వ్యాపించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా పాము విషం మనిషి నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేకుంటే ఆ విషం శరీరం మొత్తం వ్యాపించి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతుంది. అందువల్ల విష జంతువైన పాముకు దూరంగా ఉండటమే మంచిది.