https://oktelugu.com/

Animal Facts: మృగరాజులైతే ఏంటి.. వాటికీ సుఖ సంసారం కావాలి.. ఓ ఆడ సింహం సాంగత్యం కోసం..ఈ రెండు లయన్లు ఏం చేశాయంటే..

అనగనగా అది ఒక నది.. అందులో విస్తారంగా మొసళ్ళు ఉంటాయి. నీటి ఏనుగులకు లెక్కేలేదు. అలాంటి నదిలో దిగాలంటేనే పులులు కూడా భయపడతాయి. ఏనుగులు కూడా జంకుతాయి. చివరికి అనకొండలు కూడా దూరంగా జరుగుతాయి. కానీ రెండు సింహాలు ఆ నదిలో ఏకంగా కిలోమీటర్ కు పైగా ఈత కొట్టాయి. సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా సింహాలు ఇలాంటి సాహస యాత్రకు ఒడిగడతాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 12, 2024 / 10:26 AM IST

    What Did These Two Lions did for a Female Lion?

    Follow us on

    Animal Facts: ఒంటికాయ శొంఠి కొమ్ము జీవితం ఎప్పటికైనా బోరే.. జీవితం అన్నాక కాస్త ఉపశమనం ఉండాలి.. అందమైన అనుభూతి ఉండాలి. అన్నింటికీ మించి ఓ మగ జీవికి ఒక ఆడ తోడు ఉండాలి. అలాంటి ఆడ తోడు మనుషులకే కాదు జంతువులకు కూడా అవసరమే. అయితే ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేనట్టే.. అడవిలోనూ సరిపడా పురుష సింహాలు ఉన్నప్పటికీ.. వాటికి తగ్గట్టు ఆడ సింహాలు లేవు. అందుకే ఓ ఆడ సింహం సాంగత్యం కోసం.. రెండు మగ సింహాలు ప్రాణాలను పణంగా పెట్టాయి. తమ జాతి లక్షణాలకు భిన్నంగా ఏకంగా సాహస యాత్ర చేశాయి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే..

    అనగనగా అది ఒక నది.. అందులో విస్తారంగా మొసళ్ళు ఉంటాయి. నీటి ఏనుగులకు లెక్కేలేదు. అలాంటి నదిలో దిగాలంటేనే పులులు కూడా భయపడతాయి. ఏనుగులు కూడా జంకుతాయి. చివరికి అనకొండలు కూడా దూరంగా జరుగుతాయి. కానీ రెండు సింహాలు ఆ నదిలో ఏకంగా కిలోమీటర్ కు పైగా ఈత కొట్టాయి. సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా సింహాలు ఇలాంటి సాహస యాత్రకు ఒడిగడతాయి. కానీ ఆ రెండు సింహాలు ఆహార అన్వేషణకు కాకుండా.. మరొక ప్రత్యేక కారణం కోసం సాహస యాత్ర చేశాయి. ఇంతకీ ఆ కారణం ఏంటంటే.. ఆ రెండు మగ సింహాలు విరహవేదనతో ఇబ్బంది పడుతున్నాయి. తమ విరహాన్ని తీర్చుకునేందుకు ఓ ఆడ సింహం కోసం అవి తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టాయి.

    దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికాలో క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ ఉంది. ఈ అడవిలో సింహాలు విస్తారంగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా ఆ అడవిలో మృగరాజుల సంఖ్య తగ్గుతోంది. ఏంటా అని అక్కడి అధికారులు పరిశీలిస్తే.. ఆడ సింహాల కోసం మగసింహాల మధ్య పోటీ ఎక్కువైందట. అందువల్ల ఓ రెండు మృగరాజులు మరో గుంపుతో తలపడ్డాయి. వాటి బలం ముందు ఇవి నిలబడలేక వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ అవి అక్కడితో ఆగలేదు. వెంటనే అవతలి వైపు ఆడ సింహాలు ఉండొచ్చనే భావనతో సాహస యాత్ర ప్రారంభించాయి. అత్యంత ప్రమాదకరమైన కజింగ
    గా ఛానల్ (నది)ను దాటి అవతలి ఒడ్డుకు వచ్చాయి. ఇలా నదిని దాటిన సింహలలో “జాకబ్” అత్యంత బలిష్టమైనది. అడవి దున్నల దాడులు, వేటగాళ్ల ఉచ్చులు, విష ప్రయోగాలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూలతలను ఆ సింహం అధిగమించింది. అయితే గతంలో జాకబ్ ఒక ఇనుప ఉచ్చులో చిక్కుకొని తన కాలును కూడా కోల్పోయింది. అయినప్పటికీ జాకబ్ ఆడ సింహం తోడు కోసం అత్యంత ప్రమాదకర ప్రయాణాన్ని మరో సింహంతో కలిసి చేసింది. తన కాలు లేకపోయినప్పటికీ తోటి సింహం టిబు ను వెంటపెట్టుకుని వెళ్ళింది.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో జాకబ్, టిబు కజింగా ఛానల్ దాటేందుకు ప్రయత్నించాయి. అయితే కొంత దూరం ఈదుకుంటూ వెళ్లిన తర్వాత నీటి జంతువుల నుంచి ముప్పు ఏర్పడటంతో వెనక్కి తగ్గాయి. ఇలా మూడుసార్లు అవి ఆ ప్రయత్నాలు చేశాయి. ఇక నాలుగో ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన విజయవంతంగా కజింగా ఛానల్ ఈది… అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. అయితే వాటికి ఆడ సింహం జాడ దొరికిందా? లేదా? అనేది పక్కన పెడితే.. శాశ్వత నివాసం లేదా భాగస్వామి కోసం ఆ సింహాలు చేసిన సాహస యాత్ర పట్ల పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సింహాల్లో వాటి లింగ నిష్పత్తులు దారుణంగా పడిపోతున్నాయని చెప్పేందుకు జాకబ్, టిబు చేసిన సాహస యాత్ర ప్రత్యక్ష ఉదాహరణ అని జంతు శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. ఈ సింహాలకు సంబంధించిన ప్రతి కదలికను ప్రత్యేక కెమెరాలు, డ్రోన్లు చిత్రీకరించాయి. అంతేకాదు ప్రఖ్యాత జీవావరణ శాస్త్ర జర్నల్ లోనూ ఈ మగసింహాల సాహస యాత్ర ప్రత్యేకంగా ప్రచురితమైంది.