Village Cooking Channel in America: వాళ్లకు పెద్దగా చదువు రాదు. పుట్టింది మారుమూల గ్రామంలో. పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. శుభకార్యాలకు క్యాటరింగ్ కు కూడా వెళ్తుంటారు. ఇలా వారు వంటలు చేస్తుండగా ఒక వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అది కాస్త లక్షలలో వీక్షణలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వారికి కూడా ఎందుకనో తమ తయారు చేసే వంటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనిపించింది. అదే పని చేశారు. ఇందులో పిఆర్ స్టంట్ లు లేవు. అడ్డగోలు ప్రచారాలు లేవు. జస్ట్ వాళ్లకు వచ్చింది చేసుకుంటూ వెళ్లిపోయారు. అదే ఈ రోజున వారిని శిఖర స్థానంలో నిలబెట్టింది.
యూట్యూబ్ చూసేవారికి.. అందులోనూ కుకింగ్ ఛానల్స్ చూసేవారికి విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లారే వాంగే.. ఆల్వేస్ వెల్కమ్స్ యు.. అనే మాటతో రకరకాల వంటలు చేసి.. దానికి ట్రెడిషనల్ కలరింగ్ ఇచ్చి.. వండిన ఆహారాన్ని మొత్తం పేదలకు పంచుతూ యూట్యూబ్ లోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు విలేజ్ కుకింగ్ ఛానల్ నిర్వాహకులు. ఎక్కడ తమిళనాడులోని మారుమూల గ్రామంలో పుట్టిన వారు అంచలు అంచలుగా ఎదిగి ఈ స్థాయి దాకా వచ్చారు. యూట్యూబ్లో ఏకంగా రెండు కోట్లకు మించి సబ్స్క్రైబర్లను వారు కలిగి ఉన్నారు. ఆదాయాన్ని సమాజ సేవకు ఖర్చు చేస్తూ తమ దాతృత్వ గుణాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతుగా నగదు సహాయం చేశారు. వండిన వంటలను పేదలకు, అనాధలకు, వృద్ధులకు పెడుతూ తమ సేవా గుణాన్ని నిరూపించుకుంటున్నారు.
విలేజ్ కుకింగ్ ఛానల్ నిర్వాహకుల వద్దకు రాహుల్ గాంధీ కూడా వచ్చారు. ఆయన వారితో కలిసి వంట కూడా చేశారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ ఛానల్ మరింత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ ఛానల్ నిర్వాహకులు అమెరికా దాక వెళ్లిపోయారు. ఓ సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన వారు.. దక్షిణ భారతదేశ రుచులను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తున్నారు. తమదైన వంటలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అమెరికా వెళ్లినప్పటికీ వారు భారత దేశ సంప్రదాయాన్ని మర్చిపోలేదు. పంచ కట్టుతో.. గల్ల లుంగీలు ధరించి అదరగొట్టారు. అమెరికా వీధులలో తిరుగుతూ భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించారు.
విలేజ్ కుకింగ్ నిర్వాహకుల విజయ గాధలు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి కొత్త కాదు. కాకపోతే ఎక్కడో తమిళనాడు నుంచి వారు అమెరికా వెళ్లిపోవడం.. అక్కడ ఘన స్వాగతాన్ని సంపాదించడం.. వంటల ద్వారా విశేషమైన గుర్తింపును దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి రాత్రికి రాత్రి ఎవరూ విజేతలు కారు. విజేతలకు షార్ట్కట్ స్టోరీస్ ఉండవు. వీళ్లకు కూడా అంతే. వీరికి సంబంధించిన అమెరికా యాత్ర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అందుకే మన పెద్దలు కష్టేఫలి అంటారు. ఆ నానుడికి వీరు నూటికి నూరు శాతం అచ్చు గుద్దినట్టు సరిపోతారు.
View this post on Instagram