Suryapet: అది బిజీగా ఉండే రోడ్డు.. పైగా జాతీయ రహదారి కూడా.. రహదారి మీద కొబ్బరి బోండాలతో ఓ డిసిఎం వ్యాన్ వెళ్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమో, మరే కారణమో తెలియదు గాని.. ఆ డీసీఎం వ్యాన్ బోల్త పడింది. బోల్తాపడమే కాదు.. అందులో ఉన్న బోండాలు కూడా మొత్తం కింద పడ్డాయి. దీంతో ఆ డీసీఎం వ్యాన్ తోలుతున్న డ్రైవర్ కు గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆ డ్రైవర్ వెళ్ళాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
ఆ డీసీఎం వ్యాన్ ఏపీలో కొబ్బరిబోండాలను లోడ్ చేసుకొని వస్తోంది. సూర్యాపేట జిల్లా రాయన్ గూడెం వద్దకు రాగానే ఒక్కసారిగా బోల్తా పడింది. డీసీఎం వ్యాన్ బోల్తా పడడంతో అందులో ఉన్న కొబ్బరి బోండాలు మొత్తం కింద పడిపోయాయి. డ్రైవర్ తనకు గాయాలు కావడం.. రక్తం కూడా కారుతున్న నేపథ్యంలో ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళాడు. డీసీఎం వ్యాన్ బోల్తాపడడం.. కొబ్బరి బోండాలు కళ్ళకు కనిపించడంతో స్థానికులు తట్టుకోలేకపోయారు. ఇంటిల్లిపాది కలసి కొబ్బరి బోండాల వేటకు వెళ్లారు. అంతేకాదు ఒక్కొక్కరు బస్తాలకు బస్తాలు కొబ్బరి బోండాలు నింపుకొని వారి వారి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ చికిత్స చేయించుకుని వాహనం వద్దకు రాగానే అందులో ఉన్న కొబ్బరి బోండాలు కనిపించలేదు. చుట్టుపక్కల వారు కొబ్బరి బోండాలు తీసుకెళ్తున్న దృశ్యాలు అతడు చూశాడు. వారిని ఎంతగా వారించినప్పటికీ వినిపించుకోలేదు. కొబ్బరి బోండాలు తీసుకుపోవడంలో పోటీపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ కనిపిస్తుండడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉచిత పథకాలకు అలవాటు పడి ప్రజలు.. చివరికి కష్టం అనేది కూడా చేయకుండా.. పుణ్యానికి వచ్చిన కొబ్బరిబోండాలను తీసుకుపోవడానికి పోటీ పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి వారి వల్లే మన దేశం ఇలా ఉందని చెబుతున్నారు.
కొబ్బరిబోండాల డీసీఎం లూటీ.!
ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరిబోండాల డీసీఎం సూర్యాపేట మండలం రాయన్ గూడెం వద్ద బోల్తా, డ్రైవర్ కి గాయాలు..
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లొచ్చేలోపు కొబ్బరిబొండాలు ఎత్తుకెళ్ళిన స్థానికులు.#CoconutLorry #Suryapet pic.twitter.com/kVNh6DCR43
— Telugu Reporter (@TeluguReporter_) September 23, 2025