Vasuki Indicus: ప్రపంచ వ్యాప్తంగా అనేకరకాల సర్పాలు ఉన్నాయి. ఒకప్పుడు భారీ సైజు సర్పాలు కూడా ఉండేవి.. ఇప్పటికీ అమేజాన్ వంటి అడవుల్లో కొన్ని భారీ సర్పాలు ఉన్నాయి. అయితే చాలా వరకు అంతరించిపోయాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్ జిల్లా పంధారో ప్రాంతంలోని బొగ్గు గనుల్లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ప్రపంచ దృష్టిని ఆకర్షించే శిలాజం బయటపడింది. ఈ అవశేషం భూమిపై ఎప్పుడూ నివసించిన పాముల్లో అత్యంత పొడవైన జాతికి చెందినదిగా తేలింది. దానిని వాసుకి ఇండికస్ అని నామకరణం చేశారు. అంచనా ప్రకారం, ఈ సర్పం పొడవు సుమారు 10 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చు. ఇది సుమారు 4.7 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై సంచరించినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
పరిశోధన వెనుక కథ..
ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్లు సునిల్ వాజ్‌పేయీ, దేబ్‌జీత్ దత్తా నేతృత్వంలో ఈ గుర్తింపు కీలక దశలోకి ప్రవేశించింది. మొదట 2005లో లభించిన ఈ శిలాజాలు, దీర్ఘకాలం పాటు ప్రయోగశాలలో నిశ్శబ్దంగా ఉండిపోయి, 2022లో మళ్లీ పరిశీలనకు వచ్చాయి. మొదట మొసలి అవశేషాలుగా భావించిన వీటిని శాస్త్రీయంగా విశ్లేషించగా కొత్త పాముజాతి అవశేషాలుగా తేలింది. ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ అంశంపై కథనాన్ని కూడా ప్రచురించారు. ఈ పామును ‘మాడ్సోయిడే’ వర్గానికి చెందినదిగా గుర్తించారు, ఇది గోండ్వానా యుగానికి చెందిన ‘ఘోస్ట్ స్నేక్’ జాతికి సుదూర వారసత్వమైంది.
వాతావరణ పరిణామం ..
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆ కాలంలో ఉష్ణమండల వాతావరణం అతిగా వేడిగా ఉండటమే ఈ సర్ప పరిమాణ విపరీతతకు కారణం. వెచ్చని భూభాగాల్లో జీవించి, ఇతర జీవులను పట్టుకునే విశాల శరీర నిర్మాణం ఈ జాతికి ప్రత్యేకతగా ఉండేదని పేర్కొన్నారు. వాసుకి ఇండికస్ ప్రస్తుత రెటిక్యులేటెడ్ పైథాన్ లేదా గ్రీన్ అనకొండకంటే రెండింతల పొడవు కలిగినదిగా అంచనా. శిలాజాల వివరణ ప్రకారం, దీని శరీర నిర్మాణం పొడవైన గొట్టపు ఆకారంలో ఉండి, ప్రాచీన పర్యావరణానికి తగిన విధంగా మలచుకుందన్నారు.
పురాణ సంబంధం, శాస్త్రీయ విలువ
‘వాసుకి’ అనే పేరు భారత పురాణాలలో శివుడి నాగరాజుకు సంబంధించినది. ఈ పేరునే కొత్త పాముజాతికి ఇవ్వడం భారత పురాతన నాగారాధనకు ప్రతీక. పాముల పరిణామ చరిత్రను అధ్యయనం చేయడంలో ఈ ఆవిష్కరణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. క్రెటేషియస్ నుంచి ప్లీస్టోసీన్ వరకు మాడ్సోయిడే వర్గం జీవించి, పాముల పరిణామ తరాలను అర్థం చేసుకునే క్రమంలో ఈ కనుగొల్పు కీలక సూచికగా నిలుస్తోంది.
ప్రొఫెసర్లు వాజ్‌పేయీ, దత్తా వ్యాఖ్యానాల ప్రకారం, ఈ పాము అంత క్రూరమైనది కాకపోవచ్చని కూడా భావిస్తున్నారు. తీవ్ర ఉష్ణత పరిస్థితులు దాని పరిమాణాన్ని ప్రభావితం చేశాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుత దశలో లభించిన 27 శిలాజ నమూనాలను విశ్లేషించిన తర్వాత పరిశోధకులు మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.