UK Farm Jobs: ఇప్పుడంటే మనకు సుఖాలు ఎక్కువైపోయాయి. ప్రతి పనికి యంత్రాల మీద ఆధారపడుతున్నాం. కానీ వెనుకటి కాలంలో ఇలా ఉండేది కాదు. మనుషులు ఒళ్ళు వంచి పని చేసేవారు. శారీరకంగా శ్రమ చేసేవారు. అందువల్లే నాటి రోజుల్లో వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
ఇప్పటి కాలంలో కూడా మనుషులు అక్కడక్కడా పనిచేస్తూనే ఉన్నారు. అలా పని చేస్తున్న వారికి విపరీతమైన డిమాండ్ ఉంటున్నది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పటి యంత్రాల కాలంలో కూడా అలా పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగుల కంటే.. ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. తక్కువలో తక్కువ రోజుకు 20వేల వరకు వెనకేసుకుంటున్నారు. చదవగానే ఆశ్చర్యం అనిపించింది కదూ.. ఈ స్థాయిలో డబ్బులు ఇస్తే ఈ చదువులు ఎందుకు అనిపిస్తోంది కదూ..
ప్రతిరోజు కూలీలకు 20,000 ఇచ్చేది మన దేశంలో కాదు.. ఇంగ్లాండ్ లో.. అమెరికాలో మాదిరిగానే ఇంగ్లాండ్ లో కూడా విస్తారంగా భూములు ఉంటాయి. అక్కడ పంటలు విరివిగా పండుతుంటాయి. వాటికి అంతర్జాతీయ మార్కెట్లో ధర అధికంగా ఉంటుంది. అయితే అవి రొటీన్ గా పండే పంటలు కావు.. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్.. ఖరీదైన కూరగాయలు.. శ్రీమంతులు మాత్రమే తినే పండ్లు అక్కడ పండుతూ ఉంటాయి. వాటిని సాగు చేయడం.. అంతర్గత పనులు చేయడం.. పక్వానికి వచ్చిన తర్వాత కోయడం.. వాటిని ప్యాకింగ్ చేసి పంపించడం వంటి ప్రక్రియలలో మనుషులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందువల్లే అక్కడ వ్యవసాయంలో మనుషుల అవసరం అధికంగా పడుతూ ఉంటుంది.
ఇంగ్లాండ్ దేశంలో గంటకు ఇంత చొప్పున డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. అక్కడ వ్యవసాయ పనులకు వచ్చే కూలీలకు గంటకు 15 పౌండ్లు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక కూలి 8 గంటల పాటు పనిచేస్తే దాదాపు 120 పౌండ్ల వరకు వస్తుంది. దాన్ని ఇండియన్ కరెన్సీ తో లెక్కిస్తే దాదాపు 20 వేల వరకు లభిస్తుంది. అయితే అక్కడ కరెన్సీ విలువ ప్రకారం ఆ చెల్లింపులు తక్కువ అనే చెప్పాలి. ఇండియన్ కరెన్సీ తో పోల్చితే మాత్రం డబ్బులు ఎక్కువగానే లభించినట్టు అనిపిస్తుంది. ఇంగ్లాండ్ దేశంలో పనిచేసే వారు తక్కువగా ఉంటారు. పైగా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్లే వ్యవసాయ పనులకు ఎక్కువ మంది వెళ్లరు. ఇతర దేశాల నుంచి వచ్చి.. మారుమూల ప్రాంతాలలో నివాసం ఉండేవారు మాత్రమే వ్యవసాయ పనులకు వెళ్తారని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలకు తక్కువ లభిస్తుంది. ఒక కూలి 20వేల వరకు సంపాదించాలి అంటే దాదాపు 15 రోజుల వరకు కష్టపడాలి. అది కూడా ప్రతిరోజు పని ఉంటేనే ఆ మాత్రం సంపాదించవచ్చు. కానీ ఇంగ్లాండ్ దేశంలో అయితే ఒక్కరోజే అంత సంపాదించవచ్చు.