Mushroom: ఈ భూమ్మీద జంతువులు జీవనం సాగించడానికి ఆహారాన్ని తింటుంటాయి. ఇందులో మనుషులు మాత్రమే ఆహారాన్ని వండుకొని తింటారు. రకరకాల రుచులు కోరుకుంటారు. మనుషులు రుచులు కోరుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ నాలుకల మీద ఉన్న రుచి కళికలే. అందువల్లే తినే ఆహారంలో విభిన్నత్వాన్ని మనుషులు చూపిస్తుంటారు. అయితే ఈ తినే ఆహారంలో ఉప్పు, కారం, తీపి, వగరు వంటి రుచులను తినే మనుషులు.. చేదు అనే దానిని మాత్రం తినడానికి ఇష్టపడరు. చేదు తినగా తినగా తీయగా ఉన్నప్పటికీ.. దానిని రుచి చూసేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ భూమ్మీద చేదుగా ఉండే వాటిల్లో వేప, కాకర ముందు వరుసలో ఉంటాయి. వీటిని నోట్లో వేసుకుంటే చాలు కటిక చేదుగా ఉంటాయి. అయితే కొంతమంది దంతావధానం కోసం వేప పుల్లలను నమ్ముతుంటారు. వెనుకటి కాలం నుంచి వేప పుల్లలతో దంతావధానం చేయడం అలవాటుగా వస్తోంది. ఇక మధుమేహం.. ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి కాకర మంచి ఔషధమని వైద్యులు చెబుతుంటారు. అయినప్పటికీ కొంతమంది మాత్రమే కాకరకాయను తింటూ ఉంటారు. దానిలో ఉన్న చేదును పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
అత్యంత చేదు పదార్థం అదే
ఈ భూమ్మీద కాకరకాయ.. వేప విపరీతమైన చేదుగా ఉన్నప్పటికీ.. వాటిని తినేవారు చాలామంది ఉంటారు. అయితే వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేదుగా ఉండే పదార్థాన్ని మ్యూనిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. “అమరో పోస్టియా స్ట్రిప్టికా” అనే పుట్టగొడుగు ప్రపంచం లోనే అత్యంత చేదైన పదార్థంగా ప్రకటించారు. 106 బాత్ టబ్ లలో నీటిలో ఒక గ్రామ్ “అమరో పోస్టియా స్ట్రిప్టికా” కలిపినా చేదుగానే ఉంటుంది. కాకపోతే ఆ నీటిని టేస్ట్ చేసిన వెంటనే పుక్కిలిస్తారు. అయితే ఈ పుట్టగొడుగు విషపూరితమ్ కాదు. ఇది అమెజాన్, ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో కనిపిస్తుంది. ఇక ఆసియాలోనూ అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ వీటి ఉనికిని అధికారికంగా శాస్త్రవేత్తలు ప్రకటించలేదు. “అమరో పోస్టియా స్ట్రిప్టికా” లో “ఒలిగో పోరిన్ D” అనే రసాయనం ఉండడంవల్ల విపరీతమైన చేదు ఉంటుందని తెలుస్తోంది. ” “అమరో పోస్టియా స్ట్రిప్టికా ప్రత్యేకమైన పుట్టగొడుగు. ఇందులో ఒలిగో పోరిన్ D అనే రసాయనం ఉంటుంది. ఇది సహజంగా చేదును కలిగించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా చేదు అనే లక్షణం ఉన్న రసాయనాలు మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అయితే ఇది మనిషి ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తుంది.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది.. అనే అంశాలపై ప్రయోగాలు చేయాల్సి ఉందని” మ్యూనిచ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుట్ట గొడుగు పై మరిన్ని ప్రయోగాలు చేయాలని.. ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.