Teacher Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు నేటి కాలంలో చిన్నారుల జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలన్నా, అన్నం తినిపించాలన్నా, ఏడుపు ఆపాలన్నా చాలా మంది తల్లిదండ్రులు వారి చేతిలో మొబైల్ ఫోన్ పెడుతున్నారు. అయితే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి పిల్లల ఆరోగ్యం, చదువు, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాఠశాల టీచర్ వినూత్నంగా ఆలోచించి, పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. సాధారణంగా చెప్పే సూచనలు, హెచ్చరికలు కాకుండా, నేరుగా పిల్లల మనసును తాకేలా ఆమె క్లాస్‌రూమ్‌లో ఓ భావోద్వేగ స్కిట్ ప్రదర్శించారు. అదేంటో చూద్దాం..
సాధారణంగా పిల్లలకు చదువులు చెప్పే ఓ టీచర్ పిల్లలను ఫోన్ నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ టీచర్ ఓ స్కిట్ ను చేశారు. ఈ స్కిట్‌లో టీచర్ మొబైల్‌ను అతిగా ఉపయోగించడం వల్ల క్రమంగా కంటి చూపు కోల్పోయి అంధురాలిగా మారిన మహిళ పాత్రను ఎంతో సహజంగా అభినయించారు. కళ్లకు కనిపించనట్లుగా నడవడం, వస్తువులను వెతుక్కోవడం, ఇతరుల సహాయం కోసం తడబడడం వంటి సన్నివేశాలను ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఆమె నటనను చూసిన విద్యార్థులు పూర్తిగా కథలో లీనమయ్యారు.
స్కిట్ ముగిసిన తర్వాత టీచర్ పిల్లలకు మొబైల్ ఫోన్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వల్ల కళ్ల సమస్యలు, ఏకాగ్రత లోపం, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశముందని వివరించారు. అలాగే ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, స్నేహితులతో సమయం గడపడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
టీచర్ అభినయాన్ని చూసిన చిన్నారులు నిజంగానే భయపడ్డారు. ‘ఫోన్ ఎక్కువగా చూస్తే నిజంగానే ఇలా జరుగుతుందా?’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కొంతమంది పిల్లలు ఇకపై ‘ మాకొద్దు మొబైల్’ అని, అవసరం లేకుండా ఫోన్ చేతిలోకి తీసుకోమని టీచర్ ఎదుటే మాట ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే ఇలాంటి సృజనాత్మక బోధనా విధానాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “ఒక్క స్కిట్‌తో పిల్లల ఆలోచన మార్చేశారు”, “ఇలాంటి టీచర్లు ప్రతి పాఠశాలలో ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలను మొబైల్‌కు పూర్తిగా దూరం చేయడం కంటే, నియంత్రితంగా వినియోగించే అలవాటు నేర్పించడం మరింత అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి సమయం గడపడం, ఆటలు, కథలు, పుస్తకాలపై ఆసక్తి పెంచడం ద్వారా మొబైల్ వ్యసనాన్ని తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు.

