Mobile phone addiction : ఒకప్పుడు సమాచారం కోసమే ఫోన్ ను వాడేవారు. ఇప్పుడు అన్నింటి కోసం దానిని వాడుతున్నారు. మాటలు, ఆటలు, పాటలు, వినోదం, తిండి, నిద్ర.. ఇంకా చాలా సమస్తం హస్త భూషణం లో నిక్షిప్తమైన తర్వాత మనిషి సో”సెల్” కు బంధీ అయిపోయాడు. సంఘ జీవి కాస్త సోషల్ మీడియాకు బానిస అయిపోయాడు. పది మందితో మనసు విప్పి మాట్లాడాల్సిన వాడు వాట్సాప్ లో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన వాడు ఫేస్ బుక్ లో నిమగ్నం అయిపోయాడు. చివరికి ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయి.. మనిషిలో ఒక భాగం అయిపోయింది. బాత్ రూం వెళ్తున్నప్పుడు కూడా ఫోన్ వదలడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. కేవలం మన దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రాను రాను మనుషుల్లో ఫోన్ వాడకం పెరిగిపోవడంతో అది రకరకాల వ్యాధులకు దారితీస్తోంది. ఫోన్ ను పరిమితంగా మాత్రమే వాడేలా చైతన్యం తీసుకురావాలని అమెరికాకు చెందిన సంస్థ భావించింది. ఇందుకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు.. మెడ నొప్పులు, రాత్రంతా మేలుకొని అదే పనిగా ఫోన్ చూడటం, సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు అతిగా స్పందించడం, ఫోన్ విపరీతంగా చూడటం వల్ల నేత్ర సంబంధమైన వ్యాధులకు గురి కావడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే వాటన్నింటినీ దూరం చేసే విధంగా అమెరికా దేశానికి చెందిన సిగ్గీ అనే ఒక సంస్థ వినూత్న ప్రకటన చేసింది. నెల రోజులపాటు ఫోన్ అనేది చూడకుండా ఉంటే ఏకంగా పదివేల డాలర్ల బహుమతి ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ లాక్ బాక్స్, ఆకర్షణీయమైన ప్లిఫ్ ఫోన్, ఒక నెలపాటు ఉచితంగా వాడుకునే విధంగా ప్రీపెయిడ్ సిమ్ కార్డ్, మూడు నెలల పాటు వాడుకునే విధంగా సిగ్గి యూ గర్ట్ ను అందిస్తామని ప్రకటించింది. ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ పోటీలో పాల్గొనాలని సామాజిక మాధ్యమాలలో ప్రకటన ఇచ్చింది.
సిగ్గీ సంస్థ ఇచ్చిన ఈ ప్రకటన సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే చాలామంది ఈ పోటీలో పాల్గొంటామని ముందుకు వచ్చారు. ఈ పోటీకి సంబంధించి గడువు అంటూ ఏదీ లేకపోవడంతో చాలామంది తమ పేర్లను ఆ సంస్థకు సంబంధించిన వెబ్ సైట్ లో నమోదు చేసుకుంటున్నారు. ఈ పోటీ ఎప్పుడు ప్రారంభిస్తామనేది సంస్థ చెప్పలేదు.. పోటీ పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిగ్గి సంస్థ తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఈ విధమైన మార్కెటింగ్ చేసుకుంటుందని కొంతమంది అంటుండగా.. ప్రజలను డిజిటల్ డిటాక్స్ చేస్తే తప్పేముందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సిగ్గి సంస్థ ఇచ్చిన ప్రకటన రకరకాల చర్చలకు కారణమవుతోంది. అయితే ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో వేచి చూడాల్సి ఉంది.