Prakasam District: జంబలకడిపంబ సినిమా చూశారా.. అందులో అబ్బాయిలు అమ్మాయిలుగా.. అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతారు. చూసేందుకు ఆ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. సినిమాటిక్ కాబట్టి దర్శకుడు లిబర్టీ మేరకు ఆ సన్నివేశాలు ఉన్నాయి. కానీ వాస్తవ జీవితం లో అలాంటి సంఘటనలు చోటు చేసుకోవు. జరగడానికి ఆస్కారం కూడా లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఒక వింతైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లిలో అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారిపోయారు. ఇది చదువుతుంటే వింతగా అనిపించవచ్చు గాని.. అక్కడి ప్రజలకు మాత్రం పెద్ద వింత కాదు. ప్రకాశం జిల్లాలో ఈతరహాలో వివాహం జరిగింది. ఆ గ్రామస్తులు మినహా, మిగతా బంధువులకు ఆ వివాహం ఆశ్చర్యంగా అనిపించింది.
యర్రగొండపాలెం మండలం కొలుకుల అనే గ్రామంలో బత్తుల శివగంగురాజు, నందిని యువతీ యువకులు వివాహం చేస్తున్నారు. వారి కుటుంబ ఆచారాల మేరకు వధువు వరుడుగా మారిపోయాడు. వధువు వరుడిగా ముస్తాబయింది. వీరిద్దరూ ఆడ మగ వేషధారణలో విచిత్రంగా కనిపించారు. బంధుమిత్రులతో కలిసి గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు. ఆ తర్వాత తమ కుల దైవాన్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
వాస్తవానికి ఇలాంటి సంస్కృతి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని జిల్లాలలో ఇలాంటి కల్చర్ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో చాలా వరకు గ్రామాలలో పెళ్లికి ముందు ఇలాంటి వ్యవహారాలు సాగుతుంటాయి. వారి కుల దైవానికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇలాంటి వేషధారణలు వేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులకు ఈ విధానం కొత్త కాకపోయినప్పటికీ.. వివాహానికి హాజరయ్య బంధుమిత్రులకు మాత్రం విచిత్రంగా ఉంటుంది. చారిత్రక నేపథ్యం, సామాజిక కట్టుబాట్లు.. ఇతర వ్యవహారాల నేపథ్యంలో ఇలాంటి వేషధారణలకు వధూవరులు పాల్పడుతుంటారని తెలుస్తోంది.
ఇలాంటి వేషధారణ వేస్తేనే కుల దైవాలు సంతృప్తి చెందుతాయని స్థానికులు చెబుతుంటారు. అందువల్లే నూతన వధూవరులతో ఇలాంటి వేషాలు వేయిస్తారని.. కులదైవాలకు పూజలు చేయించిన తర్వాత మళ్లీ ఆ వేషాలను తొలగించుకుంటారని.. స్థానికులు అంటున్నారు. ఇటువంటి సంస్కృతి వల్ల వారి ప్రత్యేకత మిగతా వారికి తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.