Shocking Visuals: వర్షాలు కురుస్తుంటే ఎవరైనా ప్రయాణం సాగిస్తారా? అందులోనూ విస్తారంగా వాగులు పొంగుతుంటే.. బీభత్సంగా నదులు ప్రవహిస్తుంటే.. ఎవరైనా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తారా? కానీ ఈ లారీ డ్రైవర్ ఆ పని చేశాడు. నలుగురికి నచ్చింది నాకసలు నచ్చదు.. నరులెవరూ నడవనిది.. ఆ రూట్లో నేను నడుస్తానని.. బిల్డప్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనతో ఒక్కసారిగా ప్రాణాలతో బయటపడ్డాడు. చావు చివరి దాకా వెళ్లి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దట్టమైన అటవీ ప్రాంతాలకు పేరు పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తాకిడికి ఆ రాష్ట్రంలో నదులు, వాగులు వంకలు విస్తారంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి వాటి ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అక్కడి ప్రభుత్వం అనేక హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను బయటికి వెళ్లకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న ఓ లారీ డ్రైవర్ అత్యంత మూర్ఖంగా తన బండిని నడిపించాడు. అతడు వెళ్తున్న మార్గంలో వరదనీరు విపరీతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహానికి లారీ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. చివరికి సిలిండర్లతో వెళుతున్న లారీ ఒక్కసారిగా కొట్టుకుపోయింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ అతికష్టం మీద తమ ప్రాణాలను కాపాడుకున్నారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బరేలా – కుందమ్ ప్రాంతాల మధ్య పరియత్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది మీద గతంలోనే ఒక బ్రిడ్జి నిర్మించారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈనది విస్తారంగా ప్రవహిస్తున్నది. ప్రమాదకరస్థాయిలో ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నది ప్రవాహం వంతెన మీదుగా సాగుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలను దాదాపుగా నిలిపివేశారు. అయితే గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ డ్రైవర్ మాత్రం అధికారుల కళ్ళుగప్పి ఆ వంతెన మీదుగా పోనిచ్చాడు. అయితే వరద ప్రవాహం విపరీతంగా ఉండడంతో లారీ కొట్టుకుపోయింది. దీంతో డ్రైవర్, క్లీనర్ నదిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆ లారీ మాత్రం నదిలోనే ఉండిపోయింది. ప్రవాహం తగ్గిన తర్వాత దానిని బయటకు తీస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ లారీలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అవన్నీ కూడా డెలివరీ చేయాల్సినవి. అసలే వర్షాలు కురుస్తుండడం.. అత్యవసరంగా డెలివరీ చేయాల్సిన సిలిండర్ల లారీ నదిలో కొట్టుకుపోవడంతో.. అక్కడి పౌరసరఫరాల శాఖ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోచోట నుంచి లారీ తెప్పించి.. పలు ప్రాంతాలలో ఉన్న ఏజెన్సీలకు సిలిండర్లను యుద్ద ప్రాతిపదికన పంపిణీ చేశారు.
” ఎంత చెబుతున్నా సరే లారీ డ్రైవర్ వినిపించుకోలేదు. పైగా మూర్ఖంగా వెళ్లిపోయాడు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో లారీ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ నదిలో పడిపోయాడు. క్లీనర్ కూడా అందులోనే పడిపోయాడు. అతి కష్టం మీద ఇద్దరు బయటకు వచ్చారు. కాకపోతే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గ్యాస్ సిలిండర్ల లారీ నదిలో పడిపోయిందని” స్థానికులు చెబుతున్నారు.