Rajasthan Woman Leopard: చిరుత పులి.. ఈ పేరు వినిపిస్తేనే ఒంట్లో భయం కలుగుతుంది. అలాంటిది లైవ్లో కనిపిస్తే.. అది కూడా గదిలో దూరితే.. ఎలా ఉంటుంది.. ప్రాణం మొత్తం పోయినంత పనవుతుంది. పైగా ప్రాణభయంతో బయటకి పరుగులు పెట్టాలనిపిస్తుంది. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు. పైగా చిరుత పులిని చూసి భయపడలేదు. భయం స్థానంలో చాకచక్యాన్ని ప్రదర్శించింది. వివేకాన్ని వాడింది. ఫలితంగా చిరుత పులిని తరిమికొట్టకుండా.. సరి కొత్త ఉపాయం ఆలోచించింది.
రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ ప్రాంతం లో కోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో రాజస్థాన్ ప్రజల రాజసం అడుగడుగునా కనిపిస్తుంటుంది. కోటలు.. దానికి తగ్గట్టుగా అక్కడి ప్రజలు.. వారి వేషధారణ అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి ఆ ప్రాంతంలో అడవులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ అడవుల్లో రకరకాల జంతువులు కనిపిస్తుంటాయి. అందులో చిరుతపులులు కూడా ఉంటాయి. చిరుతపులులు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి ప్రవేశించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఉదయ్ పూర్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. చిరుత పులి రాగానే ఆ ఇంట్లో ఉన్న మహిళ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఆ తర్వాత భయపడింది. చివరికి తన చాకచక్యాన్ని ప్రదర్శించింది.
ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులిని గమనించిన ఆ మహిళ.. గదిలో ఉండగానే తలుపు వేసింది. అంతే వేగంగా దానిమీద ఒక వస్త్రాన్ని కప్పింది. అనంతరం ఒక తాడును దాని తోకకు కట్టింది. ఆ తర్వాత బయటికి వెళ్లి తలుపు తీసింది. బయటికి వెళ్లడానికి చిరుత పులి ప్రయత్నిస్తుండగా తోకకు కట్టిన తాడును తాగింది. ఆ వస్త్రం దాని శరీరం మీద అలానే ఉండడంతో చిరుత పులి ఆందోళనకు గురైంది. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడింది. తాడును అలాగే లాగడంతో గాండ్రించింది. అయినప్పటికీ పులి ముందుకు వెళ్లలేకపోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చిరుతపులిని ఇలా చేయడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు.. “చిరుత పులికే ఇలాంటి గతి పట్టిందంటే.. ఆ ఇంట్లో భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకే అంతు పట్టడం లేదు. ఎందుకైనా మంచిది ఆ భర్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే అతడికి కూడా ఇటువంటి గతే పడుతుందని” నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఆ చిరుతపులి తోకను తాడుతో కట్టి లాగిన ఆ మహిళ.. చివరికి అటవీ సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి ఆ పులిని బంధించారు. ప్రత్యేక బోను తీసుకొచ్చి దానిని తమ వెంట తీసుకెళ్లి.. అడవిలో వదిలిపెట్టారు.