Cuddle Therapy: స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత గడియారం నుంచి మొదలు పెడితే క్యాలెండర్ వరకు దేనితో పని లేకుండా పోయింది. వీడియోలు చూస్తున్నాం. మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తితో లైవ్లో సంభాషిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపరిమితమైన సౌకర్యాలను ఆస్వాదిస్తున్నాం. అటువంటి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పక్కనున్న మనిషితో పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నాం. దీంతో ప్రతి మనిషిలోనూ ఒంటరితనం పెరిగిపోయింది. ఆత్మ న్యూనతా భావం అధికమైంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. దీంతో ఒత్తిడి, మానసిక వేదన పెరిగిపోయింది. ఈ క్రమంలో చాలామంది ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. ఇతర మానసిక రుగ్మతలతో బాధపడిపోతున్నారు. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగిపోయింది.
ఇలాంటి వారిని గుర్తించి ఓ సంస్థ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దానికి కడిల్ therapy అనే పేరు పెట్టింది. దీని ప్రకారం 5000 చెల్లిస్తే ఆడవారికి మగవారిని, మగవారికి ఆడవారిని పంపిస్తారు. కబుర్లు చెప్పుకోవచ్చు. కలిసి కాఫీ తాగవచ్చు. ఓకే చోట కూర్చొని భోజనం చేయవచ్చు. మూడు గంటల పాటు ఏకాంతాన్ని ఆస్వాదించవచ్చు. అది కాఫీ క్లబ్ కావచ్చు.. పేరు మోసిన హోటల్ కావచ్చు.. లేకపోతే ఓయో రూమ్ అవ్వచ్చు. ఎక్కడైనా సరే భాగస్వామిని పంపిస్తారు. గాడమైన సంభాషణలు, లోతైన చర్చలకు ఇక్కడ ఆస్కారం ఉంటుంది. అలాగని లైంగికపరమైన చర్యలకు అవకాశం ఉండదు. దాన్ని పూర్తిగా నిషేధిస్తారు. ఆడవారి తొందరపడి మగవారితో తప్పుడు పని చేయకుండా ముందుగానే షరతులు విధిస్తారు. దానికి సంబంధించి బాండ్ మీద కూడా సంతకం తీసుకుంటారు. మగవారు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకుంటారు.
కోవిడ్ తర్వాత యువకులలో ఒంటరితనం పెరిగిపోయింది. యువతులలో నైరాస్యమైన భావాలు అధికమయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఈ థెరపీ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో ఇది అంతగా ఆకట్టుకోలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా ప్రచారం చేయడంతో ఢిల్లీ యువత దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. తన బాధను పంచుకుంటున్నారు. దాని నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ విధానం పట్ల చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మూడు గంటల పాటు ఏకాంతంగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ థెరపీలో చాలామంది తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఊరు పేరు తెలియని వ్యక్తులతో ముందుగా మాట్లాడేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత తమ ఒంటరితనాన్ని ఆ కొద్దిసేపు దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని.. సాంత్వన కలుగుతోందని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కూడా ఒక డేటింగ్ లాగానే ఉందని.. అయితే శారీరక సంబంధాలు లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది శారీరకంగా సంబంధాలు పెట్టుకోవడానికి తాపత్ర పడుతున్నప్పటికీ.. షరతుల వల్ల వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా యువత పిచ్చి గాని.. నచ్చినవారితో నేరుగా మాట్లాడవచ్చు. అవసరమైతే తమ భావాలను పంచుకోవచ్చు. అంతేతప్ప ఇలా ఆన్లైన్లో డబ్బులు చెల్లించి.. ఎటువంటి పరిచయం లేని వ్యక్తులతో తమ విషయాలు చెప్పుకోవడం నిజంగా హాస్యాస్పదమే.