Blue seas turning black : ప్రకృతి రూపొందించిన కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు, సముద్రాలు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో చెట్లు విస్తారంగా ఉంటాయి. చెట్లు విస్తారంగా ఉన్నప్పుడు ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. తద్వారా జీవ సమతౌల్యం మెరుగ్గా ఉంటుంది. ఇక సముద్రాలలో నీరు ఆవిరి రూపంలో మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు వర్షించి.. తిరిగి భూమిని చల్లబరుస్తాయి. భూమిలో భూగర్భ జలాలు పెరగడానికి దోహదం చేస్తాయి. అయితే ఇంత అద్భుతంగా ఉన్న ప్రకృతి చక్రాన్ని అభివృద్ధి పేరుతో మనుషులు వక్రంగా మార్చుతున్నారు. తద్వారా ప్రకృతిలో ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అకారణంగా వర్షాలు వస్తున్నాయి. ఊహించని స్థాయిలో కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఇక భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడం వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిపోయిన కాలుష్యం వల్ల.. ఇతర ప్రకృతి విపత్తుల వల్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అభివృద్ధి అనేది ప్రకృతిపై ఎంత ఒత్తిడిని కలగజేస్తోందో.. అంతే స్థాయిలో ఒత్తిడిని సముద్రాలూ కూడా ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల కాలంలో మహాసముద్రాలలో నీరు నల్లగా మారుతున్న తీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. పలు పరిశోధనలలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గడచిన రెండు దశాబ్దాలలో సముద్రాలలో నీరు 21 శాతం రంగు మారిందని తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ప్లిమత్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. వ్యవసాయ భూములలో పురుగుమందుల వాడకం అధికమైపోయింది. తద్వారా అవశేషాలు సముద్రంలో చేరుతున్నాయి. అవన్నీ కలిసి సముద్రం అడుగు భాగంలో పేరుకుపోతున్నాయి. అందువల్ల సముద్రాలలో నీరు క్రమేపి నలుపు రంగులోకి మారిపోతున్నది. సముద్రం అడుగుభాగంలో ఉన్న జంతువులు వెలుతురు లేకుండా జీవించలేవు. అందువల్ల అవి వెలుతురు కోసం ఉపరితలంలోకి వస్తున్నాయి. ఉపరితలంలో సరైన స్థాయిలో ఆహారం లభించకపోవడంతో అవి కన్నుమూస్తున్నాయి.
” ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పురుగుమందుల వాడకం అధికమైపోయింది. పంట ఉత్పత్తుల కోసం ఇలా చేయక తప్పడం లేదు. గతంతో పోల్చితే చీడపీడల దాడి పంటలపై అధికంగా ఉంది. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పురుగుమందులను విపరీతంగా వాడుతున్నారు. అందువల్ల ఆ అవశేషాలు క్రమేపీ సముద్రం అడుగుభాగంలోకి చేరిపోతున్నాయి. అందువల్ల సముద్రంలో నీరు నలుపు రంగులోకి మారుతున్నది.. నీరు అలా మారిపోవడం వల్ల సముద్రంలో ఉన్న జీవులు చనిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం అని” శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి.. మొక్కలు విరివిగా నాటి.. కాలుష్య కారకాలను నది జలాల్లోకి పంపించకుండా ఉంటే సముద్రాలు బాగుంటాయని.. అవి నలుపు రంగులోకి మారకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికోసం అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంటున్నారు.