Inspirational tree planting story: మొక్క అనేది చిన్న పరిమాణంలోనే ఉంటుంది. అది పెరుగుతూ వృక్షం లాగా మారుతుంది. వృక్షమైన తర్వాత ఎన్నో రకాలుగా పర్యావరణానికి ఉపయోగపడుతుంది. పిట్టల నుంచి మొదలు పెడితే సేద తీరే మనుషుల వరకు ప్రతి ఒక్కరికి చెట్టు అనేది పరోపకారిగా ఉంటుంది. అందుకే తరువును మించిన సహాయము.. చెట్టును మించిన ఉపకారము ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు అంటారు.
ప్రస్తుతం అభివృద్ధి అనే మాయలో మనిషి పడిపోయాడు. అందువల్లే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చెట్ల ఆధారంగా ఉండే వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. దీనివల్ల జరుగుతున్న పరిణామాలను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో గీసుకొండ ప్రాంతానికి చెందిన వీరగోని రాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని ఆయన అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఒక ఆలోచన చేశారు. అతడు చేసిన ఆ ఆలోచన అందరితోనూ చప్పట్లు కొట్టిస్తోంది.
ఒక మనిషి కాలం చేస్తే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మూడు, ఐదు రోజుల్లో పక్షికి వేస్తారు.. పదో రోజు దినం చేస్తారు. ఈ మూడు రోజులు కూడా పక్షులకు ఆహారం పెట్టడం సర్వసాధారణం. ఆహారం వండి పెట్టడం ద్వారా పక్షుల రూపంలో చనిపోయిన వ్యక్తి వచ్చి తింటాడని ఒక బలమైన నమ్మకం. బలగం సినిమా కూడా ఇదే నేపథ్యంతో రూపొందింది. అయితే చెట్లు లేకపోవడం వల్ల పక్షులు రావడం లేదు. దీంతో పిట్టకు పెట్టె ప్రక్రియ లో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీనిని గమనించిన రాజ్ కుమార్ ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.
గీసుకొండ లో స్మశాన వాటికలో చెట్లు కనిపించకపోవడంతో రాజ్ కుమార్ లో ఆలోచన పెరిగింది. అతనికి వచ్చిన ఆలోచన మొక్కను పెంచే విధంగా చేసింది. రాజ్ కుమార్ స్మశాన వాటికలో మొక్కను పెంచాడు. అవి కాస్త వృక్షంగా మారిపోయింది.. ఆ వృక్షం మీద పిట్టలు నివాసం ఉండడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఎవరైనా చనిపోతే పిట్టకు వేసే ప్రక్రియ నికరాటంకంగా సాగిపోతోంది. రాజ్ కుమార్ స్మశాన వాటికలో నాటిన ఒక మర్రి మొక్క పెద్ద వృక్షంగా మారింది. దానిని ఆలవాలంగా చేసుకొని అనేక పక్షులు నివసిస్తున్నాయి. అంతేకాదు అంత్యక్రియల కోసం వచ్చిన వారు ఆ చెట్టు నీడన సేద తీరుతున్నారు.
“పిట్ట ముట్టడం అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం. పిట్ట ముట్టకపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించలేదని అర్థం. మా స్మశాన వాటికలో చెట్లు అసలు లేవు. అందువల్లే 2015లో ఒక మర్రి మొక్కను నాటాను. అది కాస్త పెద్ద వృక్షం లాగా మారింది. ఇక అనేక మొక్కలు నాటితే అవి కూడా చెట్లు అయ్యాయి. వాటి మీద పక్షులు జీవిస్తున్నాయి. అందువల్లే పిట్టముట్టే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని” రాజ్ కుమార్ చెబుతున్నాడు.