Odisha Farmer: వ్యవసాయం అనేది దండగ ఎప్పుడూ కాదు. కాకపోతే రైతులు కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. డిమాండ్ కి తగ్గట్టుగా పంటలు సాగు చేస్తూ ఉండాలి. పంటల సాగులో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. అప్పుడే వ్యవసాయం పండగ అవుతుంది. మిగతా ఉద్యోగాల కంటే ఎక్కువ రాబడి లభిస్తుంది. దీనిని నిజం చేసి చూపించాడు ఓ రైతు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
Also Read: కొడుకు సక్సెస్ కాలేకపోయినా.. కూతురు సచిన్ ను తలెత్తుకునేలా చేసింది
అతని పేరు హిరోద్ పటేల్. ఒడిశాలోని సుందర్ గడ్ జిల్లా రతన్పూర్ గ్రామం. హిరోద్ కొంతవరకు చదువుకున్నప్పటికీ.. అతడికి మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సంప్రదాయ వ్యవసాయం కాకుండా అధునాతన పద్ధతుల్లో సాగు చేయడం.. అందులో విపరీతమైన లాభాలు సాధించడం అంటే అతడికి చాలా ఇష్టం. అందువల్లే అతడు వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబించడం మొదలుపెట్టాడు. ఉన్న భూమిలోనే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకున్నాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ షెడ్డు అభివృద్ధి ప్రాజెక్టు ను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఆ ప్రాజెక్టులో భాగంగా తన భూమిని చెరువు మాదిరిగా తవ్వాడు. అందులో చేపల పెంపకాన్ని మొదలుపెట్టాడు. చెరువు గట్లను అలా వదిలేయకుండా.. వాటి వెంట సొరకాయ మొక్కలను నాటాడు.. కాదు చెరువు చుట్టూ తీగతో ట్రెల్లిస్ అనే వ్యవస్థను నిర్మించాడు. దీనివల్ల సొర పాదులు నేలను తాకకుండా నీటి పైన పెరగడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు తెగుళ్లను కూడా తగ్గించింది. అదనపు నీటి అవసరం కూడా తగ్గిపోయింది.
ప్రతిరోజు అతడికి దాదాపు 1500 వరకు సొరకాయలు లభించేవి. దీనివల్ల అతడికి అదనంగా 35, 000 ఆదాయం వచ్చింది.. ఇలా సంవత్సరానికి అతడేకంగా లక్ష వరకు అదనంగా సంపాదించాడు. అంతేకాదు తనకున్న భూమిలో నాటు కోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. ఇటు చేపలు, అటు నాటు కోళ్లు, చేపల పెంపకం ద్వారా అతడు ప్రతి ఏడాది దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ” సమగ్రమైన వ్యవసాయం అనేది గొప్ప ఆర్థిక ప్రణాళిక. దానిద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మూస విధానంలో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. వినూత్నమైన విధానాలలో వ్యవసాయం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తుంటే అదనపు ఆదాయం లభిస్తుందని” హిరోద్ చెబుతున్నాడు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చని అతడు వివరిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం ఇతడు సాధించిన విజయ గాధను ఇతర రైతులకు వివరిస్తోంది. తద్వారా రైతులను వినూత్నమైన విధానాల వైపు మళ్ళిస్తోంది.