Midnight Delivery Chaos: మనుషులంతా ఒక్కటే. కాకపోతే వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అంతరాలు ఉంటాయి. కులాలు, మతాలు కాదు .. డబ్బుంటేనే ఈ సమాజం ఎన్ని లోపాలు ఉన్నా సరే ఆమోదిస్తుంది. అదే డబ్బు లేకుండా.. లోపాలు లేకుండా ఉంటే కనీసం గౌరవం కూడా ఇవ్వదు. అందుకే డబ్బున్న వారికి దర్పం ఉంటుంది. కళ్ళు నెత్తిన ఉంటాయి. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బేషజం అంతకంటే లేదు.
కూటికోసం కోటి తిప్పలు అంటారు కదా.. ఈ భూమి మీద ఉన్న మనుషులు తమ కడుపు నింపుకోవడానికి.. తమనే నమ్ముకున్న వారి ఆకలి తీర్చడానికి అనేక రకాల పనులు చేస్తుంటారు. అందులో కొందరు కాస్త సుఖంగా ఉండే పనులు చేస్తే.. మరికొందరేమో కష్టంతో కూడుకున్న పనులు చేస్తారు. కష్టపడి పని చేసే వారికి సమాజం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అవసరమైతే వారికి తమ వంతు తోడ్పాటు అందించాలి. కానీ నేటి కాలంలో కష్టపడి పనిచేసే వారికి రెస్పెక్ట్ లేకుండా పోతోంది.
ఉదాహరణకు పొలంలో నిత్యం శ్రమించే రైతు.. తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్ వస్తే ఎవరూ దేఖరు. కనీస విలువ కూడా ఇవ్వరు. కానీ అదే రైతు పంటలు పండించకుండా ఉండి ఉంటే ప్రపంచం మొత్తం పస్తులు ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా చాలామంది రైతులను చులకనగా చూస్తుంటారు. రైతు అంటే గ్రహాంతర వాసిగా భావిస్తుంటారు.
రైతుల సంగతి పక్కన పెడితే మన దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం పెరిగిపోయింది. అని కూడా డోర్ డెలివరీ దాకా వచ్చేస్తున్నాయి. డోర్ డెలివరీ బాయ్ లకు కనీసం గౌరవం లభించడం లేదు. ముఖ్యంగా నగరాలలో కొన్ని ప్రాంతాలలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కడానికి అవకాశం లేదని అపార్ట్మెంట్ల లో సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. ఆంక్షలు కూడా విధించారు.
లిఫ్ట్ వాడితే డెలివరీ బాయ్ లు జరిమానా చెల్లించాలని షరతులు విధించారు. చివరికి అర్ధరాత్రి రెండు గంటలకు కూడా మెట్లు ఎక్కి రావాలని అపార్ట్మెంట్ వాసులు తీర్మానం చేయడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఓ డెలివరీ ఏజెంట్ తనకి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో చాలామంది అతడి బాధతో ఏకీభవిస్తున్నారు. అతడు అనుభవించిన ఇబ్బందిని తలుచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. డెలివరీ బాయ్ లు కూడా మనుషులేనని.. వారికి మర్యాద ఇవ్వాలని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో గిగా వర్కర్లకు ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిగా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. అయితే కొన్ని అపార్ట్మెంట్లలో మాత్రం డెలివరీ బాయ్ లను పురుగులను చూసినట్లు చూస్తున్నారు. అందువల్లే ఓ డెలివరీ బాయ్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతడికే కాదు చాలామందికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురవుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ఎటువంటి అడుగులు వేస్తాయనేది చూడాల్సి ఉంది.